ఉసేన్ బోల్ట్ కు కరోనా.. ఆందోళనలో క్రిస్‌గేల్..!
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2020 6:00 AM GMTప్రపంచంలోని వేగవంతమైన రన్నర్, ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. బోల్ట్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఏమీ లేకపోవడంతో.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లాడు.
‘అందరికి శుభోదయం.. నాకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షలో ఇది బయటపడింది. నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను నా స్నేహితుల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. అందుకే హోం క్వారంటైన్‌లోకి వెళ్తున్నాను. ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్ ఏంటనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకోవాలని భావిస్తున్నాను. నా ప్రజలు అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని వీడియోలో బోల్ట్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల క్రితం అంటే.. ఆగస్టు 21 ఉసేన్ బోల్ట్ పుట్టిన రోజు. తన 34వ పుట్టిన రోజు వేడుకలను బోల్ట్ ఎంతో అట్టహాసంగా జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. కాగా.. ఈ పార్టీలో ఎవరూ కూడా మాస్క్ కూడా ధరించలేదు సరికదా.. భౌతిక దూరం పాటించడం అన్న సంగతే లేదట. ఇప్పుడు బోల్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారందరూ ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ పార్టీకి యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్, మాంచెస్టర్ సిటీ స్టార్ స్టెర్లింగ్, బేయర్ లెవెర్కుసేన్ అటాకర్ లియోన్ బెయిలీ హాజరైనట్లు సమాచారం.