యుఎస్ఎ క్రికెట్ డైరెక్టర్ల బోర్డులో తెలుగు తేజం
By రాణి Published on 25 Dec 2019 1:04 PM ISTముఖ్యాంశాలు
- యుఎస్ఎ క్రికెట్ డైరెక్టర్ గా వేణుగోపాల్ రెడ్డి సేవలు
- అట్లాంటాలో సొంత ఐటీ కంపెనీ నడుపుతున్న రెడ్డి
- నల్గొండ జిల్లాలోని ఓ చిన్న గ్రామం జన్మస్థలం
- ఉన్నత చదువులకోసం యూఎస్ వెళ్లిన వేణుగోపాల్
- చాలాకాలం పాటు అక్కడ లీగ్ క్రికెట్ ఆడిన వేణు
- యుఎస్ లో క్రికెట్ పై పెరుగుతున్న అభిమానం
ఖండాంతరాలు దాటిపోయినా క్రికెట్ మీదున్న మమకారం చావలేదు. సమున్నత స్థాయికి చేరుకుంటున్న కొద్దీ దానిపై మరింత మక్కువ పెరుగుతూ వచ్చిందే తప్ప తరగలేదు. తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి, ఉన్నతస్థాయి ఉద్యోగంకోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఓ యువకుడికి తనకు నచ్చిన, తాను మెచ్చిన క్రీడకు సేవలందించే సమున్నతమైన స్థానం దక్కింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన యుఎస్ఎ క్రికెట్ లో ప్రతిష్ఠాత్మకమైన డైరెక్టర్ స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఏకైక తెలుగు వ్యక్తి ఆయనే..
వేణు కుమార్ రెడ్డి పిసికె యుఎస్ఎ క్రికెట్ బోర్డ్ పదిమంది డైరెక్టర్లలో ఒకరిగా నియమితులయ్యారు. ఈ బోర్డ్ లో ఉన్నత స్థానంలో అప్పాయింటైన ఏకైక తెలుగు వ్యక్తి ఈయనే. అట్లాంటాలోని ఐటీ కంపెనీ యజమాని అయిన వేణుకుమార్ రెడ్డి వృత్తిపరంగా ఎదిగినా తనకు చాలా ఇష్టమైన క్రికెట్ క్రీడను మాత్రం మర్చిపోలేదు. అక్కడికి వెళ్లిన తర్వాతకూడా ఖాళీ సమయాలను క్రికెట్ పై ఉన్న మక్కువను తీర్చుకోవడానికే ఉపయోగించారు. ఆసియానుంచి, కరేబియన్ దీవులనుంచి పెద్ద ఎత్తున జనాభా యూఎస్ కి వచ్చి ఉంటున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన, అందులోనూ ఇండియాలో ఎక్కువమందికి చాలా నచ్చిన క్రికెట్ యూఎస్ లో ఇప్పటివరకూ అంతగా ప్రాచుర్యాన్ని పొందలేదు. యూఎస్ లో సాకర్ మ్యాచ్ లకు ఉన్నంత క్రేజ్ ఇంక మరే క్రీడకూ లేదన్నంతగా అభిమానం వెల్లువెత్తుతుంది.
సాకర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతటి ఆదరణ కలిగిన క్రీడగా గుర్తింపును పొందిన క్రికెట్ కు ఇప్పుడిప్పుడే అమెరికాలో ఆదరణ కనిపిస్తుండడం విశేషం. యుఎస్ఎ క్రికెట్ కి వన్డే ఇంటర్నేషనల్ స్టేటస్ కూడా ఉంది. ప్రస్తుతం యూఎస్ఎ క్రికెట్ లక్ష్యం ఏంటంటే 2023లో జరగబోయే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించడం. ఇందుకోసం చాలా గట్టి కృషి జరుగుతోంది. ఐటీ కంపెనీ యజమానిగా, యుఎస్ఎ క్రికెట్ డైరెక్టర్ గా రాణిస్తున్న వేణుగోపాల్ రెడ్డికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.
వేణుగోపాల్ రెడ్డి నియామకం అలా జరిగింది
గతంలో ఏర్పాటైన అనేక బాడీలను మిస్ మ్యానేజ్ మెంట్ కారణంగా ఐసీసీ అనేకసార్లు సస్పెండ్ చేసింది. ఇప్పుడున్న యుఎస్ఎ క్రికెట్ ను 2018లో ఏర్పాటు చేశారు. అప్పట్నుంచీ ప్రొఫెషనలిజమ్ కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ముందున్న బాడీలతో పోలిస్తే యుఎస్ఎ క్రికెట్ ఎంతో మెరుగైన కృషి చేస్తోందని చెబుతున్నారు. యుఎస్ఎ క్రికెట్ లో ఉన్న మొత్తం పదిమంది డైరెక్టర్లలో ఏడుగురు డైరెక్టర్లు క్లబ్స్ నుంచి లీగ్స్ నుంచి ఎన్నికైనవాళ్లు. మిగిలిన ముగ్గుర్నీ బోర్డ్ నియమించింది. ఇలా ఎన్నికైన ఏడుగురిలో యుఎస్ఎ తరఫున క్రికెట్ ఆడిన ఇద్దరు పూల్ క్రికెటర్లను బోర్డ్ లోకి తీసుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి నియామకం అలా జరిగింది.
దీనివల్ల ప్రొఫెషనలిజం పెరుగుతుందని వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు. తను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో యుఎస్ఎ తరఫున లీగ్ మ్యాచ్ లు విస్తృంతంగా ఆడారాయన. ప్రస్తుతం యుఎస్ఎ క్రికెట్ లో అన్ని విభాగాల్లోనూ యాభైశాతం తెలుగువారికి, ఇరవై శాతం కరేబియన్స్ కీ ప్రాధాన్యత ఉంది. వేణుగోపాల్ రెడ్డి యుఎస్ఎ క్రికెట్ యూత్ కమిటీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ లు ఆడడంవల్ల ఆటగాళ్లకు మంచి ఎక్స్పోజర్ ఉంటుందని, ఆటపట్ల అవగాహన బాగా పెరుగుతుందని వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు. వాళ్లని ఎంకరేజ్ చేసేందుకు ఒక ప్రొఫెషనల్ లీగ్ ని ప్లాన్ చేస్తున్నామని ఆయన చెబుతున్నారు. 2021కల్లా యుఎస్ఎ క్రికెట్ ఐపిఎల్ టీమ్ ని తెరమీదికి తీసుకురాగలుగుతామన్న గట్టి నమ్మకంతో ఉన్నారాయన.
యుఎస్ లో క్రికెట్ పై పెరుగుతున్న అభిమానం
భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ దేశాల్లో మాదిరిగానే యుఎస్ఎలోకూడా విస్తృతస్థాయిలో క్రికెట్ కు అభిమానులు పెరుగుతున్నారనీ, త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో కమర్షియలైజ్ చేసే అవకాశాలను గురించి యుఎస్ఎ క్రికెట్ ఆలోచిస్తోందనీ వేణుగోపాల్ రెడ్డి చెబుతున్నారు. యుఎస్ లో ఈ గేమ్ ప్రమోషన్ పై విల్లో టీవీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. యుఎస్ఎ క్రికెట్ గవర్నింగ్ బాడీ బిసిసిఐని సంప్రదించి ఒక చక్కటి టూర్ కోసం ప్లాన్ చేస్తోంది. యుఎస్ఎ క్రికెట్ టీమ్ సభ్యులు ఇండియా టూర్ కి వస్తే ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకునే అవకాశం కలుగుతుందని, ఆటమీద పట్టుకూడా పెరుగుతుందని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది యుఎస్ టీమ్ ముంబై టీమ్ లో ప్రాక్టీస్ గేమ్స్ ఆడుతుందని చెబుతున్నారు.