అమెరికాలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 10వేల కరోనా కేసులు
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తోంది. అమెరికాలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 10 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 54 వేలకు పెరిగింది. మరో వైపు మృతుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. నిన్న ఒక్క రోజే 150 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 775కు చేరింది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో మంగళవారం 53 మంది చనిపోయారు. దీంతో అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 201కి చేరింది. బాధితుల సంఖ్య 25వేలకు పెరిగింది. వైరస్ తొలుత విజృంభించిన వాషింగ్టన్ మంగళవారం ఒక్క కేసు నమోదు కాలేదు. కాగా న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్, ఇల్లినాయిస్, ప్లోరిడాలోనూ వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది.
ఇదిలా ఉండగా.. అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో షట్‌డౌన్ చేసే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈస్టర్ పర్వదినం ఏప్రిల్ 12 నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ సహకరించాలని, ప్రభుత్వం కూడా తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. అలాగే ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి త్వరలో కాంగ్రెస్ ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.