అమెరికాలో కరోనా మరణమృదంగం.. ఒక్క రోజే 2వేల మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 7 Aug 2020 9:08 AM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడని దేశం అంటూ దాదాపుగా లేదు. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలై ఆరు నెలలు గడిచినా ఆగడం లేదు. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,92,75,561 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,17,938 మంది మృత్యువాత పడ్డారు. భారత్‌లో కూడా ఈ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఇక ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకుల వణుకుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 2వేల మందికి పైగా మరణించారు. దీంతో ఈ మహమ్మారి బారీన పడి మృతి చెందిన వారి సంఖ్య 1,62,805కి చేరింది. అత్యధికంగా న్యూయార్క్ రాష్ట్రంలో 32వేల మంది మృతి చెందగా.. న్యూజెర్సీలో 15,800, కాలిఫోర్నియాలో 10,006 మంది చనిపోయారు. ఇక ఈ మహమ్మారి రానున్న రోజుల్లో మరింత విజృంభించే అవకాశం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత 29లక్షలతో బ్రెజిల్, 20లక్షల కేసులతో భారత్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.