ఐస్‌క్రీం రుచి.. చూసినందుకు జైలుశిక్ష..
By తోట వంశీ కుమార్ Published on 7 March 2020 8:01 PM ISTఓ యువకుడు షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. సరదాగా ఐస్‌క్రీమ్ రుచి చూశాడు. అంతే.. నెలరోజులు కటకటాలపాలయ్యాడు. అదేంటీ.. ఐస్‌క్రీం రుచి చూస్తే జైలు శిక్ష ఎందుకు వేస్తారనే మీ సందేహాం..? అతడు చేసిన పని అలాంటిది మరీ..?
అమెరికాలోని టెక్సాస్‌లో 24ఏళ్ల అండెర్సన్ అనే యువకుడు నివసిస్తున్నాడు. గత సంవత్సరం ఆగస్టులో దగ్గరలోని వాల్‌మార్ట్‌కు వెళ్లాడు. కొంతసేపు షాపింగ్ చేసిన తరువాత తనకు ఐస్‌క్రీం తినాలనిపించింది. దీంతో.. పక్కనే ఉన్న ఫ్రీజర్‌లో నుంచి ఐస్‌క్రీం ను బయటికి తీసి నాలుకతో కొంచెం రుచిచూశాడు. తరువాత దాన్ని యధాస్థానంలో పెట్టేశాడు. దీన్ని అంతటిని తన సెల్‌ఫోన్‌తో రికార్డు చేసుకున్నాడు. ఇంటికి వెళ్లాక దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అంతే.. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను లక్షా యాభైవేల మందికి పైగా వీక్షించారు. ఈ విషయం వాల్‌మార్ట్ సిబ్బందికి తెలిసింది. అతడు ఏ ఐస్‌క్రీం బాక్స్ ఎంగిలి చేశాడో తెలియక.. ఆ ఫ్రీజర్‌లో ఉన్న మొత్తం ఐస్‌క్రీంను తొలగించింది. దీంతో సంస్థకు 1565 డాలర్లు నష్టపోయింది.
ఈ వీడియో సరదాగా తీసుకున్నప్పటికీ ఇది ప్రజల ఆరోగ్యభద్రతపై ఎన్నో అనుమానాలను లేవనెత్తింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ యువకుడి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి నెలరోజుల జైలు శిక్షతో పాటు 1000 డాలర్లు జరిమానా విధించింది. అయితే ఆ యువకుడు మాత్రం తాను ఎంగిలి చేసిన ఐస్‌క్రీంను కొన్నానని అధికారులతో వాదించాడు. కేవలం ఫన్ కోసమే ఇలా చేసినట్లు చెప్పాడు. సీసీ కెమెరాల్లో కూడా ఇదే విషయం స్పష్టమైంది. అయినప్పటికి యువకుడి ప్రవర్తన కారణంగా కోర్టు అతనికి శిక్ష విధించింది.