అత్యాచారాల‌పై సీఎం యోగి సంచ‌ల‌న నిర్ణ‌యం

By Newsmeter.Network  Published on  9 Dec 2019 11:41 AM GMT
అత్యాచారాల‌పై సీఎం యోగి సంచ‌ల‌న నిర్ణ‌యం

సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ముందుండేది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్. ఇటీవ‌ల జ‌రిగిన ఉన్నావ్ అత్యాచారం కేసును దృష్టిలో ఉంచుకుని యోగి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయ‌డానికి యోగి స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌హిళ‌ల‌పై , చిన్నారుల‌పై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ‌ని, ఇలాంటి కేసుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు ఈ కోర్టులు ఏర్పాటు చేయ‌నున్నారు. ఉన్నావ్ బాధితురాలి మృతి అనంత‌రం ప్ర‌భుత్వంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో యోగి స‌ర్కార్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఈ క్ర‌మంలో అత్యాచారం కేసుల‌ను విచారించ‌డానికి 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల‌ను, పిల్ల‌ల‌పై నేరాల‌కు సంబంధించిన కేసుల విచార‌ణ‌కు 74 కోర్టుల‌ను ఏర్పాటు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది యోగి స‌ర్కార్‌.

ఇటీవల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఓ యువతి మీద అత్యాచారం చేశారు. ఈ నేప‌థ్యంలో కేసు విచార‌ణ నిమిత్తం కోర్టుకు హాజ‌ర‌వుతుండ‌గా, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు దుండ‌గులు. తనను తాను కాపాడుకోవడానికి ఆ యువతి మంటలతోనే సుమారు కిలోమీటర్ దూరం వరకు ప‌రుగులు పెట్టింది. బాధితురాలిని ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. నిందితులను హైదరాబాద్ దిశ హంతకుల తరహాలోనే ఎన్‌కౌంటర్ చేయాలని ఆమె చివరి కోరిక కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

Next Story