తండ్రి చివరి చూపుకు దూరమైన యూపీ సీఎం యోగి
By తోట వంశీ కుమార్
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో సోమవారం ఉదయం 10.44 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన మూత్ర పిండాల సమస్యతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. లాక్‌డౌన్ కారణంగా రేపు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం లేదని సీఎం ఆదిత్యనాథ్ తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో యూపీలోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.
‘మా నాన్న మరణవార్త విని చాలా బాధ పడ్డా. విశ్వసనీయతతో నిస్వార్థంగా కష్టపడి పనిచేయాలని మా నాన్న ఎల్లప్పుడూ చెబుతుండేవారు. చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండాలనుకున్నాను. కానీ 23 కోట్ల యూపీ ప్రజల బాధ్యతను దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరకు వెళ్లలేకపోయాను. ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నాను. అంత్యక్రియల సందర్భంగా లాక్‌డౌన్ మార్గదర్శకాలను పాటించాలని మా అమ్మను, బంధువులను కోరుతున్నాను. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత నేను వస్తాను’ అంటూ సీఎం యోగి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్‌గా పదవీవిరమణ చేసిన ఆనంద్ సింగ్ బిస్త్.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని యమకేశ్వర్ జిల్లా పంచౌర్ గ్రామంలో నివసిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ అంతిమ సంస్కారాలను రేపు అక్కడే నిర్వహించనున్నారు. ఆనంద్ సింగ్ మృతిపై యూపీ గవర్నర్ అనందీబెన్ పటేల్, బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ తదితరులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.