యూఎన్‌ఓలో మరోసారి పాక్‌కు భంగపాటు..!
By న్యూస్‌మీటర్ తెలుగు
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు భంగపాటు ఎదురైంది. ఈనెలలో జరిగే సమావేశాల్లో కశ్మీర్ అంశంపై ఎలాంటి చర్చ ఉండబోదని భద్రతా మండలి స్పష్టం చేసింది. కశ్మీర్ కంటే ప్రాధాన్యమైన అంశాలు చాలా ఉన్నాయని తెలిపింది. ఇటీవల జరిగిన సమావేశాల్లోనే కశ్మీర్‌పై చర్చించామని, అందుకే ఈసారి సమావేశాల్లో ఆ అంశా న్ని చర్చించడం లేదు. కశ్మీర్ అంశాన్ని చేర్చాలని ఏ సభ్యదేశమూ కోరలేదని భద్రతామండలి వర్గాలు తెలిపాయి.
ఆర్టికల్-370 రద్దు తర్వాత పాకిస్థాన్, చైనాలు కుతకుతలాడిపోయాయి. అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని ఇరుకునపెట్టడానికి ప్రయత్నించాయి. గత ఆగస్టులో చైనా, పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశంపై రహస్యంగా చర్చించారు. ఐతే, ఎలాంటి ప్రకటన చేయకుండానే ఆ సమావేశాలు ముగిశాయి. పైగా ఈ సమస్య భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని అత్యధిక మంది సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనుకున్న పాక్, చైనాలకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.