15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలివే
By సుభాష్ Published on 1 Oct 2020 2:56 PM ISTకరోనా కారణంగా అన్ని సంస్థలతో పాటు సినిమా థియేటర్లు సైతం మూతపడ్డ విషయం తెలిసింది. అయితే అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్5.0 ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లను, మల్టీప్లెక్స్‌లకు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగించింది.
అక్టోబర్ 15 నుంచి అనుమతించినవి ఇవే..
♦ 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేట్లు, మల్టీఫ్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. దీని కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియామవళి జారీ చేసింది.
♦ వాణిజ్య శాఖ జారీ చేసిన ప్రత్యేక మార్గదర్శకాల ఆధారంగా వాణిజ్య సంస్థలు, ఎగ్జిబిషన్‌లు తెరుచుకోవచ్చు
♦ క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్మిమ్మింగ్ ఫూల్స్‌కు అనుమతి.
♦ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ ఏచసే నియామవళి ఆధారంగా ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, ఈ తరహా సంస్థలు తెరుచుకునేందుకు అనుమతి
విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు
♦ అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునేందుకు వెసులుబాటును కేంద్రం ఆయా రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అలాగే ఆయా సంస్థలకు విధించిన షరతులు మాత్రం పాటించాల్సి ఉంటుంది.
♦ ఆన్‌లైన్ విద్య, దూరవిద్య కొనసాగాలి.
♦ విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరు కావచ్చు
♦ పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర, విద్యాశాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి మార్గదర్శకాలను తయారు చేసుకోవాలి.
♦ రాష్ట్రాలు రూపొందించిన మార్గదర్శకాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి.
♦ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టీమ్‌లోని పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పని చేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈ అవసరాన్ని గుర్తిస్తారు.
50 శాతం వరకే అనుమతి
♦ సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్ఖృతిక, మత, రాజకీయ వేడుకలు, ఇతర సమ్మేళనాలకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. 100 మంది వరకు అనుమతించారు. అక్టోబర్ 15 తర్వాత కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల వంద మందికి మించి ఇలాంటి సమావేశాలు నిర్వహించే అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. అలాగే హాల్ కెపాసిటీలో గరిష్టంగా 50శాతం భర్తీకి అనుమతి ఇస్తారు. 200 మందికి మించకూడదు.
♦ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి. అలాగే కంటైన్‌మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది.