దేశ వ్యాప్తంగా పౌల్ట్రీ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది కోవిడ్‌–19 (కరోనా వైరస్‌). గ‌డిచిన నెల‌ రోజులుగా కోవిడ్‌–19 ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాల‌ను ఎదుర్కొంటుంది. చికెన్, గుడ్ల ద్వారా.. కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న అబద్ధపు ప్రచారం జ‌రుగుతున్న‌ నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా చికెన్, గుడ్ల వినియోగం త‌గ్గిపోయింది.

ఈ నేపథ్యంలో తిరిగి పౌల్ట్రీ బిజినెస్‌ పుంజుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పౌల్ట్రీ ఫామ్‌ అసోషియేషన్‌ సభ్యులు ఓ స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. చికెన్‌, చేప‌లు తిన‌డం కారణంగా కోవిడ్‌–19 వైరస్‌ సోకదని.. ఈ విష‌య‌మై ప్రజల్లో అవగహన కల్పించేందుకు గోరఖ్‌పూర్‌లో ఈ వినూత్న‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివ‌రాల్లోకెళితే.. కేవలం రూ. 30 రూపాయాలకే అన్‌లిమిటెడ్‌ చికెన్‌తో మీల్స్‌ను అందిస్తున్న‌ట్లు పౌల్ట్రీ ఫామ్‌ అసోషియేషన్ చికెన్‌ మేళా స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. దీంతో పెద్ద ఎత్తున చికెన్‌ ప్రియులు అక్కడికి చేరుకున్నారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా జ‌రిగిన ఈ ఫెస్ట్‌కు భారీగా జనం క్యూ కట్టారు. దాదాపు రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. ఈ ఫెస్ట్‌లో వెయ్యి కిలోలకు పైగా చికెన్ వండగా.. కొద్ది సేప‌ట్ల‌నే మొత్తం గిన్నెల‌న్నీ ఖాళీ చేశారు చికెన్ ప్రియులు.

దీనిపై పౌల్ట్రీ నిర్వహకులు మాట్లాడుతూ.. కోవిడ్‌–19 వైరస్‌ కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ చాలా దెబ్బతిన్నది. చికెన్‌, గుడ్లు, మటన్‌, ఫిష్ తినడం కార‌ణంగా క‌రోనా వైరస్‌ సోకుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. దీనిపై ప్రజలకు అవగహన కల్పించేందుకే ఈ భారీ చికెన్‌ మేళా కార్యక్రమాన్ని నిర్వహించామ‌ని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.