ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సలహాలు ఇస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ను అరికట్టేందుకు జాగ్రత్తలు అంటూ కొందరు రాజకీయ నాయకులు మాత్రం అర్థం పర్థం లేకుండా వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు పాలు అవుతున్నారు.

ఇటీవల కొందరు బీజేపీ నేతలు కరోనాను అరికట్టేందుకు గోమూత్రం, ఆవు పేడ, ఎండ చాలా బాగా పని చేస్తాయని వ్యాఖ్యనించారు. ఆ తర్వాత తీవ్ర విమర్శల పాలు అయ్యారు. కరోనాపై అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోదీ ఇప్పటికే ఎంపీలకు, కేంద్రమంత్రులకు సూచించారు.

Also Read: తల్లీ బిడ్డలను విడదీసిన కరోనా.. తల్లి కోసం పరితపిస్తున్న కవలలు

ఇప్పుడు ఏకంగా కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రే అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు 15 నిమిషాల పాటు ఎండలో ఉండే కరోనా అరికట్టవచ్చని ఓ అసాధారణ సలహా ఇచ్చారు. ఎండలో నిల్చోవడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతుందని, ఇది కరోనా వంటి వైరస్‌లను చంపేస్తుందని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: కరోనా ఎఫెక్ట్.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబేపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మీరు ఏం చదివారో చెబుతారా అంటూ కొందరు కామెంట్లు చేయగా, ఎండలో నిలబడితో వైరస్‌లన్ని చచ్చిపోతే ఇటలీ ప్రజలు అదే పని చేసే వారుగా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఓ నెటిజన్‌ అయితే ఈ రోజు ప్రధాని జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో సైతం ఇదే ఉంటుందేమో అంటూ కామెంట్‌ చేశారు. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన డాక్యుమెంట్‌లో ఎక్కడా కూడా డి విటమిన్‌ పొందాలని, శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలని లేదు. సూర్యరశ్మి ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అసాధారణ సలహాలను ప్రజలు ఎవరూ నమ్మొద్దని, చేతులను శుభ్రం చేసుకోవడం, జన సముహాలకు దూరంగా ఉండటం, దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మోచేయిని అడ్డుపెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.