ముఖ్యాంశాలు

  • లాక్‌డౌన్‌ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు
  • అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి: కేంద్ర ఆరోగ్య శాఖ
  • వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 415 కరోనా కేసులు నమోదు కాగా.. 23 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో ఏడు కరోనా మరణాలు చోటు చేసుకున్నాయని అన్నారు. లాక్‌డౌన్‌ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అయితే అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కిట్ల తయారీకి ఐసీఎమ్‌ఆర్‌ అనుమతి ఉంటే చాలన్నారు. దేశ వ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో కరోనా టెస్టులు చేస్తున్నామని, ప్రైవేట్‌ ల్యాబ్స్‌కు గైడ్ లైన్స్‌ ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శానిటైజర్‌ తయారీకి అవసరమైన ముడి సరుకు సరఫరాలో కొరత లేకుండా చూస్తున్నామని తెలిపింది. మాస్క్‌లు, శానిటైజర్లు ఎక్కువ ధరలకు విక్రయించొద్దని చెప్పింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. విమానాల రద్దు ఈ నెల 24 అర్థరాత్రి నుంచి అమలుకానుంది. అయితే సరుకు రవాణా విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని విమాన సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ ఆదేశించింది.

బెంగళూరులో కరోనా ప్రభావం నేపథ్యంలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.