అంపైర్ తప్పుడు నిర్ణయానికి పంజాబ్ బలి.. లేదంటే గెలిచేదే..!
By తోట వంశీ కుమార్ Published on 21 Sep 2020 4:49 AM GMTఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. అయితే.. అంపైర్ చేసిన ఓ పొరపాటు వల్లే పంజాబ్ ఓటమి పాలైంది. దీంతో పంజాబ్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ పాలక మండలికి ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. మాజీ క్రికెటర్లు, నెటీజన్లు సదరు అంపైర్ పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
158 పరుగుల లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ ఆరంభంలో తడబడినా.. మయాంక్ అగర్వాల్ (60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89) సూపర్ ఇన్నింగ్స్‌తో విజయం దిశగా పంజాబ్ సాగుతోంది. ఆ జట్టు విజయానికి 12 బంతుల్లో 25 పరుగుల కావాల్సిన క్రమంలో రబడా 19వ ఓవర్ అందుకున్నాడు. క్రీజులో మయాంక్, క్రిస్ జోర్డాన్ ఉన్నారు. తొలి బంతిని డాట్ చేసిన అగర్వాల్ రెండో బంతిని ఫోర్ కొట్టాడు. ఇక మూడో బంతి ఎక్స్‌ట్రా కవర్ రీజియన్ వైపు ఆడి క్విక్ డబుల్ తీశాడు. అయితే లెగ్ అంపైర్ నితీన్ మీనన్.. క్రిస్ జోర్డాన్ పరుగులు పూర్తి చేయలేదని ఓ రన్ షార్ట్ చేశాడు. అయితే టీవీ రిప్లేలో మాత్రం అతను లైన్‌మీదనే బ్యాట్ పెట్టినట్లు స్పష్టమైంది. ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు చేస్తే విజయం అనగా కింగ్స్ 12 పరుగులే చేసింది. నిజానికి అంపైర్ కోత విధించిన పరుగు కలుపుకుంటే.. పంజాబ్ సూపర్ ఓవర్ అవసరం లేకుండానే గెలిచేది.
ఇక అంపైర్ చేసిన పొరబాటుపై మాజీ క్రికెటర్లు, నెటీజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సదరు అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని, భారత మాజీ క్రికెటర్, కింగ్స్ పంజాబ్ మాజీ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ట్విటర్ వేదికగా ఈ షార్ట్ రన్‌కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. ‘అంపైర్ తీసుకున్న నిర్ణయంతో నేను ఏకీభవించడం లేదు. షార్ట్ రన్ ఇచ్చిన ఇతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి. అది షార్ట్ రన్ కానే కాదు'అని కామెంట్ చేశాడు.
ఒక పరుగు కోత ఉండొద్దు. ఇలాంటి అంశాల్లో సాంకేతికను పరిగణనలోకి తీసుకోవాలి. మూడో అంపైర్ సరైన సమయంలో గుర్తిస్తేనే అది సాధ్యమవుతుంది. రెండు పాయింట్లతో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ అవకాశం కోల్పోతే ఏంటీ పరిస్థితి..? అని ఆకాశ్ చోప్రా ఆగ్రహాం వ్యక్తం చేశాడు. మొత్తానికి పంజాబ్ మాత్రం ఓ తప్పుడు నిర్ణయానికి బలైందని, మయాంక్ అద్బుత పోరాటానికి విలువ లేకుండా పోయిందని నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించడంతో పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆఖరి ఓవర్‌లోనే ఆ జట్టు 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89) వీరోచిత ఇన్నింగ్స్‌తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. రబాడ వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది. రెండో బంతికి కేఎల్ రాహుల్, మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో పంజాబ్ చాప్టర్ క్లోజ్ అయ్యింది. 3 పరుగుల టార్గెన్ ను ఢిల్లీ సునాయాసంగా ఛేదించి సూపర్ విక్టరీ అందుకుంది.