కోల్‌కత్తాకు షాకిచ్చిన అంపైర్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 6:48 AM GMT
కోల్‌కత్తాకు షాకిచ్చిన అంపైర్లు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి తరువాత పుంజుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

శనివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకొని విజయం సాధించి మంచి ఊపు మీదుంది. అయితే.. ఆ జట్టుకు అంపైర్లు షాకిచ్చారు. నిన్నటి మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. ఈ మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌ శైలి నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఆన్‌పీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ గఫెనీ, ఉల్హాస్‌ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా.. శుభ్‌మన్‌ గిల్‌ (57; 47 బంతుల్లో, 4×5), దినేశ్‌ కార్తిక్‌ (58; 29 బంతుల్లో, 8×4, 2×6) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు సాధించింది. చేధనలో పంజాబ్‌ 15 ఓవర్లు పూర్తి అయ్యేసరికి వికెట్‌ నష్టానికి 115 పరుగులు చేసింది. నికోలస్ పూరన్‌ (16; 10 బంతుల్లో, 4×2, 1×6) కూడా బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్‌ విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు మాత్రమే కావాలి. ఈ దశలో సునీల్ నరైన్‌.. పూరన్‌ను బౌల్డ్ చేసి 18వ ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లో బంతుల్లో పంజాబ్‌కు 14 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆఖరి ఓవర్‌లో నరైన్‌ 11 పరుగులే ఇచ్చి మన్‌దీప్‌ను ఔట్ చేశాడు. ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవ్వగా.. మాక్స్‌వెల్‌ బౌండరీ సాధించాడు. దీంతో కోల్‌కత్తా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. సునీల్‌ నరైన్‌ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ అనంతరం నరైన్‌ బౌలింగ్‌ శైలి పై ఆన్‌పీల్డ్‌ అంపైర్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై బీసీసీఐ స్పందించింది. 'నరైన్‌ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నాం. ప్రస్తుతం అతను బౌలింగ్‌ వేయవచ్చు. మరోసారి ఫిర్యాదు వస్తే మాత్రం బీసీసీఐ నుంచి క్లియరెన్స్‌ వచ్చే వరకు నరైన్‌ బౌలింగ్‌ వేసే అవకాశం ఉండదు' అని బీసీసీఐ విడుదల చేసిన ప్రటనలో పేర్కొంది.

Next Story