నలుపు రంగు పులి.. ఫోటోలలో చూపించినందుకు చాలా థాంక్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2020 1:23 PM GMT
నలుపు రంగు పులి.. ఫోటోలలో చూపించినందుకు చాలా థాంక్స్

నలుపు రంగు పులి.. ఈ పేరును ఎప్పుడైనా విన్నామా లేదు కదా..! అయితే మనం ఒక ఫోటోగ్రాఫర్ కు ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే చాలా చాలా అరుదైన నలుపు రంగు పులిని మనకు చూపించాడు.. కాదు కాదు.. పులులు నలుపు రంగులో కూడా ఉంటాయని తెలిసేలా చేశాడు. తెలుపు రంగు పులులే మనం అరుదైనవని భావించాము.. కానీ నలుపు రంగు పులి ఇంకా అరుదైనదట. ఈ నలుపు రంగు పులులు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. భారతదేశంలో దాదాపు అంతరించిపోయి ఉన్నాయి.

1990వ దశకంలో ఒడిశాలో ఈ పులులను కనుగొన్నారు. ఒడిశాలోని సిమ్లిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో కనిపిస్తాయి. మెలనిన్‌ టైగర్స్‌గా పిలుస్తారు. శరీరంలో ఉండే మెలనిన్‌ కారణంగా రంగుల్లో మార్పులు వస్తూ ఉంటాయి.. అందుకే ఈ పులిని అలా పిలుస్తారు. మెలనిన్ ఎక్కువగా ఉంటే నలుపు రంగు వస్తుంది.

నల్లరంగు పులుల సంఖ్య దేశంలో గణనీయంగా తగ్గుతోందని.. ప్రస్తుం ఆరో, ఏడో నల్లపులుల మాత్రమే ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఇవి దాదాపు బెంగాల్‌ టైగార్‌లా కనిపిస్తాయి. సైజ్‌లో మాత్రం బెంగాల్‌ టైగర్‌ కంటే చిన్నగా ఉంటాయట. ఇంతకూ ఈ మధ్య కాలంలో ఈ నలుపు రంగు పులి ఎక్కడ కనిపించిందో తెలుసా..? ఒడిశాలోని సిమ్లిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో..!

ఒక ఔత్సాహిక ఫోటోగ్రాఫర్‌ ఈ ఫోటోలను తీశాడు. ఆయన పేరు‌ సౌమెన్‌ బాజ్‌పేయ్‌. ‘నేను చాలా పులులను చూశాను. ఇక్కడ పక్షులను, జంతువులను చూస్తుండగా అనుకోకుండా ఒక నల్లని చారల పులి వచ్చింది. మొదట నేను దానిని గుర్తుపట్టలేదు. అది కొన్ని నిమిషాల వరకు నా కళ్ల ముందు ఉంది. మిగిలిన పులులతో పోలిస్తే భిన్నమైన పులి అని నాకు అర్థం అవ్వడంతో.. వెంటనే ఫోటోలు తీశాను. ఈ పులి నా కంట పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు. ఏది ఏమైనా నల్ల పులి ఉంటుందని తెలిసేలా చేయడమే కాకుండా ఫోటోలు తీసినందుకు చాలా థ్యాంక్స్ భయ్యా అని నెటిజన్లు ఈ ఫోటోల కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు.

Next Story