AP: సీఎం జగన్ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By అంజి Published on 22 March 2023 12:00 PM ISTAP: సీఎం జగన్ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ దంపతులు.. ఆ తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించారు. అనంతరం వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించి, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. ఈ శుభ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పాడతాయని అన్నారు. ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిశాఖ రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
హిందూ నూతన సంవత్సరం ఉగాది- 2023 సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృతు నామ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది రైతులు బాగుండాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సంవత్సరం గొప్పగా ఉండాలని ఆకాంక్షించారు. ''రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.'' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.