యుగయుగాల ఉగాది

By రాణి  Published on  24 March 2020 9:41 PM IST
యుగయుగాల ఉగాది

ఉగాది. అసలుసిసలైన తెలుగువారి పండుగ. అసలైన తెలుగు సంవత్సరాది. నిజానికి తెలుగువారికి అసలైన కొత్త సంవత్సరం మొదలయ్యేది ఈ పండుగతోనే. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ..కాలం గడిచే కొద్దీ ఉగాది పండుగకున్న ప్రత్యేకతనే మరచిపోతున్నాం. పాశ్చాత్య పోకడలకు పోయి ఆంగ్ల సంవత్సరాది( న్యూ ఇయర్) నే కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నాం.

సాధారణంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు పుట్టినపుడు జాతకాలు చూస్తుంటారు. నక్షత్రాలు, జన్మరాశులన్నింటినీ పరిశీలిస్తారు. జాతకాల్లో దోషాలను చూపించుకుని మరీ పూజలు చేయించుకుంటుంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే..మన తెలుగు పండుగైన ఉగాది నుంచే. కాదని వాదించేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి పుట్టిన తిథి, నక్షత్రం, రాశి ఇవన్నీ ఆంగ్ల సంవత్సరాది నుంచి వచ్చాయా ? ఎవరు అవునన్నా, కాదన్నా మన ఉగాదికుండే ప్రత్యేకతే వేరు. ఏడాదికోసారి వచ్చే ఈ ఉగాది మళ్లీ ఏడాది వరకూ మన జన్మ నక్షత్రం, రాశిని బట్టి మన ఆదాయ, వ్యయాలు, గౌరవావమానాలను గురించి తెలియజేస్తుంది. అందుకే ఉగాది పర్వదినం రోజున ప్రతి ఆలయంలోనూ పంచాంగ శ్రవణం ఉంటుంది. ప్రతి కొత్త ఉగాదికి కొత్త పంచాంగం వస్తుంది. ఈ ఉగాదికి శ్రీ వికారి నామ సంవత్సరం ముగిసి..శ్రీ శాశ్వరి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.

Also Read : అర్థరాత్రి నుంచి దేశమంతా లాక్‌డౌన్‌

ఇంగ్లీషు నెలలులాగానే..తెలుగు నెలలు కూడా 12 ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది వస్తుంది. అసలు ఉగాది ఎలా వచ్చింది. ఎందుకు జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా ? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది వెనుక పురాణ కథలు

ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది - వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

Also Read : జేబులకు చిల్లు..క్యాష్ నిల్

చైత్ర శుక్ల పాడ్యమి రోజున విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా కూడా ఉగాదిని జరుపుకుంటారు. ఇదే విధంగా శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాదిని జరుపుకుంటారని చరిత్ర చెప్తోన్న మరో కారణం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

ఏటా వచ్చే ఉగాది రోజున కుటుంబమంతా తలస్నానాలు ఆచరించి, కొత్తబట్టలు ధరిస్తారు. ఏడాదికి ఆరు కాలాలు కాబట్టి..ఆరు రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడి చాలా ప్రత్యేకం. మన జీవితంలో వచ్చే ఆటుపోట్లను, సుఖ దుఃఖాలను, లాభనష్టాలను సూచిస్తుంది. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు ఇలా ఆరురుచులూ కలిసేలా..ఉగాది పచ్చడిలో బెల్లం, మామిడి, వేప పూత, పచ్చిమిర్చి, ఉప్పు, అరటిపండు వేసి ఉగాది పచ్చడిని తయారుచేస్తారు.

ఈ ఉగాదిని ఇంట్లోనే జరుపుకోండి

కోవిడ్ 19 (కరోనా వైరస్) యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతకమైన వైరస్. ఇప్పటికే ఇండియా దాదాపుగా షట్ డౌన్ అయింది. చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇంకొంతమంది సరదాగా కుటుంబాలతో గడుపుతున్నారు. ఈ సరదా, సంతోషం జీవితమంతా ఉండాలంటే ఎవరూ బయటికి రాకపోవడం ఉత్తమం. అత్యవసర సమయాల్లో తప్ప ఎవరూ బయటికి రావొద్దని ముఖ్యమంత్రులు, ప్రధాని మోదీ సూచనలిస్తున్నారు. వారి సూచనలు పాటిస్తూ..ఇంట్లోనే ఉండి ఆరోగ్యంగా ఉగాదిని కుటుంబంతో కలిసి జరుపుకుందాం.

Next Story