తొలిసారి చట్టసభలో సభ్యునిగా ఎన్నికైన ఉద్ధవ్‌ఠాక్రే..!
By Newsmeter.Network
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి చట్టసభలో సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన సీఎంగా కొనసాగాలంటే చట్టసభల నుంచి ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో మహారాష్ట్ర విధాన పరిషత్తు సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం ఈసీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుహ్యరీతిలో ఉద్ధవ్ ఠాక్రే కొద్ది నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహావికాస్ ఆఘాడీ కూటమిగా ఏర్పడి ఉద్ధవ్ ఠాక్రేకు సీఎంగా బాధ్యతలు అప్పగించాయి. కాగా ఉద్ధవ్‌కు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆరు నెలల్లో ఏదైనా చట్టసభ నుంచి ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read :మావోల చెరనుండి భర్తను విడిపించుకున్న భార్య
ఇందులో భాగంగా ఏప్రిల్ 24నాటికి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒకదానికి ఉద్ధవ్ ఠాక్రే నామినేషన్ దాఖలు చేశారు. ఈ తొమ్మిది స్థానాల్లో బీజేపీ నుంచి నలుగురు, శివసేన, ఎన్సీపీకి ఇద్దరు చొప్పున కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికయ్యే అవకాశం ఉంది. కానీ తొలుత కాంగ్రెస్ సైతం రెండు స్థానాలకు పోటీలోకి దిగేందుకు సిద్ధమైంది. కూటమి సభ్యుల సూచనలతో వెనక్కు తగ్గడంతో ఉద్ధవ్ ఠాక్రే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం లభించింది. గురువారం మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల స్వీకరణ తంతు ముగియడంతో ఈ మేరకు ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మరో ఎనిమిది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న ఠాక్రే మొట్టమొదటి సారి చట్టసభలో సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Also Read :హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. కానీ..!