బాలుడి మృతి కేసు.. నిజాల నిగ్గు తేల్చడంలో పోలీసులు..
By అంజి Published on 13 Feb 2020 1:33 PM IST
హైదరాబాద్: తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన చిన్నారి విహాన్ (2) కేసులో పోలీసులు నిజాలను నిగ్గుతేల్చే ప్రయత్నంలో ఉన్నారు. చిన్నారి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ ఆధారంగా విహాన్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని బేగంపేట ఏసీపీ పి. నరేశ్‌రెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నామని, హోటల్ నుంచి ఆహార నమునాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం ఖమ్మం జిల్లా లింగగూడెంకు చెందిన ఎట్కూరి రవి నారాయణరావు, భార్య, ఇద్దరు కుమారులతో కలిసి వీసా పని నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. కాగా వారు బేగంపేటలోని మానస సరోవర్ హోటల్ బస చేశారు. రాత్రి భోజనాంతరం హోటల్ రూమ్‌లో నారాయణరావు కుటుంబం నిద్రించింది. ఈ క్రమంలోనే అర్థరాత్రి ఒంటిగంటకు చిన్న కుమారుడు విహాన్‌కు వాంతులు అయ్యాయి. వాంతుల విషయాన్ని గుర్తించిన భార్య శ్రీ విద్య.. వెంటనే భర్తకు చెప్పింది. అదే సమయంలో భర్త రవి నారాయణరావుకు కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున శ్రీవిద్య తండ్రి ప్రసాదరావు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి హైదరాబాద్‌లోని వీరు ఉంటున్న హోటల్‌కు వచ్చాడు. అప్పటికి ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లుడి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి ఉదయం 8 గంటలకు హోటల్ చేరుకున్నారు. అప్పుడే చిన్న కుమారుడు విహాన్ ఆపస్మారక స్థితిలోకి చేరుకున్నట్లు భార్య శ్రీ విద్య.. భర్తకు చెప్పింది. చిన్నారిని వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా భార్య శ్రీవిద్య, పెద్ద కుమారుడు వరుణ్‌ను నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే రవినారాయణ తీసుకున్న ఆహారాన్నే అదే హోటల్‌లో బస చేసిన మరో ఇద్దరు తీసుకున్నారని, వారు ఆరోగ్యంగానే ఉన్నారని బేగంపేట ఏసీపీ తెలిపారు. రవినారాయణ కుటుంబం రాత్రి సమయంలో మరెక్కడైనా ఆహారం తిన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతుడు పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఆహార నమునాల రిపోర్టు రాగానే మరిన్ని విషయాలు తెలుస్తాయని వారు అన్నారు.
ఇదిలా ఉంటే.. కలుషిత ఆహారం తీసుకోవడమే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నామని కిమ్స్ ప్రకటన చేసింది. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. డిహైడ్రేషన్‌కు కారణాలు తెలియరాలేవని, ఫుడ్‌పాయిజన్‌గానే అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.
మానస సరోవర్ హోటల్‌లో ఆహార నమునాలను తనిఖీ అధికారులు సేకరించారు. ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్ సుదర్శన్ నేతృత్వంలోని బృందం.. బాధితులు తిన్న ఆహారంతో పాటు, రూమ్ వాంతులకు సంబంధించిన తొమ్మిది నమునాలను సేకరించారు. అనంతరం వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.