రూ. 2 వేల నోటు రద్దు కానుందా..?

By సుభాష్  Published on  28 Feb 2020 9:25 AM GMT
రూ. 2 వేల నోటు రద్దు కానుందా..?

దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోటును కేంద్రం రద్దు చేయనుందా..? రెండువేల నోటును రద్దు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర సర్కార్‌ స్పందనేంటి అనే విషయాలు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. ఏటీఎంలలో రెండు వేల నోట్లను నిలిపివేయడం, అలాగే ఆర్బీఐ నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్లో రెండు వేల నోట్లు క్రమంగా తగ్గిపోతున్నాయి. త్వరలో ఈ నోట్లను రద్దు చేయబోతున్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఇండియన్‌ బ్యాంక్‌ మార్చి 1వ తేదీ నుంచి 2 వేల నోట్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. దీంతో జనాల్లో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 3వేల 988 ఏటీఎంలలో మార్చి 1వ తేదీ నుంచి కేవలం రూ.500, 200, 100 నోట్లు మాత్రమే లభించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మిగతా బ్యాంకుల్లో కూడా ఈ నోట్లు ఉండవని, పెద్ద నోట్ల స్థానంలో రూ.500 నోట్లు రీప్లేస్‌ చేస్తాయనే వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరో వైపు రెండువేల నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు ఇటీవల ఆర్బీఐ తెలిపింది. కాగా, సమాచార హక్కు చట్టం కిద అడిగిన ప్రశ్నకు స్వయంగా ఆర్బీఐనే దాదాపు 18 నెలలుగా ఈ పెద్ద నోట్లను ప్రింట్‌ చేయడం లేదని పేర్కొంది.

2018-19 మధ్య కాలంలో చలామణీలో ఉన్న బ్యాంకు నోట్లలో రెండు వేల నోట్ల షేరు మూడు శాతానికి తగ్గిపోవడంతో ఈ నోట్ల రద్దు ప్రచారానికి మరింత బలం చేకూరింది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నారు..

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. రెండువేల నోట్లను రద్దు చేసే ఆలోచన లేదని, ఏటీఎంలలో పెద్ద నోట్లు నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే రెండువేల నోట్లు చెలామణీలో ఉంటాయని, ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దని చెప్పుకొచ్చారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత వచ్చినా.. ఈ నోట్ల చలామణి తగ్గుముఖం పడుతుండటంతో ప్రజల్లో కాస్త ఆందోళన మొదలైంది.

Next Story