భైంసాలో 144 సెక్షన్.. అర్థరాత్రి ఇరువర్గాల ఘర్షణ..!
By Newsmeter.Network Published on 13 Jan 2020 4:06 AM GMT
నిర్మల్: జిల్లాలోని భైంసా పట్టణంలో ఆదివారం అర్థరాత్రి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్వాగల్లిలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా మరో వర్గానికి చెందిన వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ చిలికి చిలికి పెద్దదిగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో రెండు వర్గాలు ఒకరిపై మరోకరు రాళ్లు రువ్వుకున్నారు. మూడు మోటర్ సైకిళ్ల, రెండు ఇళ్లను గుర్తు తెలియని దుండుగుల దగ్ధం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గొడవ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ నెలకొన్న భయానక వాతావరణాన్ని పోలీసులు సమీక్షించారు. ఈ హింసాకాండలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సి.శశిధర్ రాజు, భైంసా సీఐ వేణుగోపాల్ రావు, ముథోల్ ఎస్సై అశోక్, కానిస్టేబుళ్లు గాయపడ్డారు. మరికొందరికి కూడా ఈ ఘర్షణలో గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు.
కాగా ఈ ఘటన నేపథ్యంలో భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మతపరంగా సున్నితమైన పట్టణం. ఈ పట్టణంలో చివరిసారిగా 2008లో రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ప్రస్తుతం భైంసాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రశాంత వాతావరణ నెలకొంది. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఉన్నాతాధికారులు తెలిపారు.