శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణలో కొత్త ట్విస్ట్

By సుభాష్  Published on  16 Sep 2020 6:03 AM GMT
శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణలో కొత్త ట్విస్ట్

బుల్లి తెర సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తు విచారణ చేసే కొద్ది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, దేవరాజ్‌లను ఏ1, ఏ2,3లుగా పోలీసులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే రిమాండ్‌ రిపోర్టులో మాత్రం దేవరాజ్‌ను ఏ1, సాయికృష్ణ ఏ2, అశోక్‌రెడ్డి ఏ3గా చేర్చినట్లు తెలుస్తోంది. కేసుమరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే ఈ మార్పు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణి ఎంతగా కోరినా దేవరాజ్‌ అంగీకరించలేదని, ఈ కారణంగానే శ్రావణి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో వైపు సెప్టెంబబర్‌ 7న పంజాగుట్టలోని శ్రీకన్య హోటల్‌లో జరిగిన గొడవపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దేవరాజ్‌ తమ కూతురిని వేధించాడని శ్రావణి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడం కూడా అతన్ని ఏ1గా చేర్చడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ఈనెల 9న హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల మధుర నగర్‌లో నివసిస్తున్న శ్రావణి ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇంకా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దేవరాజ్‌, సాయికృష్ణలను విచారించిన పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆర్‌ఎక్స్‌ 100 నిర్మాత అశోక్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. ఫోన్‌ సైతం స్వీచ్‌ఆఫ్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్పారు. అయితే శ్రావణిపై ఈ ముగ్గురి వేధింపులు కూడా ఎక్కువైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు 17 మంది సాక్షులను విచారించారు. పోలీసు అదుపులో ఉన్న దేవరాజ్‌, సాయికృష్ణలను రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న అశోక్‌రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కానున్నట్లు చెప్పినప్పటికీ సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయన సెల్‌ఫోన్‌ ఆధారంగా అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

కాగా, సినిమా రంగంలో అవకాశాల పేరుతో శ్రావణితో అశోక్‌రెడ్డి దగ్గరైనట్లు పోలీసులు గుర్తించారు. శ్రావణికి దేవరాజ్‌ దగ్గర కావడంతో తట్టుకోలేకపోయిన అశోక్‌రెడ్డి సాయికృష్ణ ద్వారా ఒత్తిడికి తీసుకువచ్చి విడిపోయేలా చేసినట్లు తెలుస్తోంది. శ్రావణి ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

Next Story