సినీ పరిశ్రమలో మరో విషాదం.. నటుడు సమీర్‌ శర్మ ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2020 10:44 AM GMT
సినీ పరిశ్రమలో మరో విషాదం.. నటుడు సమీర్‌ శర్మ ఆత్మహత్య

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరక ముందే మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హిందీ టీవీ సీరియల్‌ నటుడు సమీర్‌ శర్మ (44) ముంబైలోని మలాద్‌లో అద్దెకుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'కహానీ ఘర్‌ ఘర్‌ కీ', 'మూ రిష్తే హై ప్యార్‌ కే' వంటి పలు హింది సీరియళ్లలో నటించి ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సమీర్‌ శర్మ మరణంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.

సమీర్‌ నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌, బుధవారం రాత్రి సీలింగ్‌కి వేలాడుతున్న అతడి శరీరాన్ని గమనించారు. వెంటనే సొసైటీ మెంబర్‌లకు తెలపగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సమీర్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమీర్ శర్మ మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో.. కనీసం 48 గంటల కిందట ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్‌ నోట్‌ సహా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీర్‌ మరణానికి ఆర్థిక ఇబ్బందులు కారణమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పలువురు సినీ ఆర్టిస్టులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.

Next Story
Share it