పసుపు బోర్డు ఏర్పాటు చేయం..!
By అంజి
నిజామాబాద్: జిల్లా పసుపు రైతులు మరోసారి రోడ్డేక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటుపై పోరాడకుండా కాలాయాపన చేస్తున్నారని పసుపు బోర్డు సాధన సమితి మండిపడింది. రైతులను ఎంపీ అర్వింద్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. పసుపు బోర్డు అవసరం లేదని అనడం న్యాయం కాదన్నారు. ఎంపీ అర్వింద్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసారాని.. ఇప్పుడు పసుపు బోర్డు వద్దంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎంపీ అర్వింద్ తన పదవికి రాజీనామా చేసి రైతులతో నడవాలని సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు.
వేల్పూరు మండలం లక్కోరాలో పసుపు రైతులు సమావేశం అయ్యారు. ఇప్పటికైనా అందరం కలిసి కట్టుగా పోరాడి బోర్డును తెచ్చుకుందామని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్న తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు వాపోతున్నారు. పంట కోతకు వస్తుండటంతో ధరపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు అంటున్నారు. గత నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సీరియస్ ఇష్యూగా పసుపు బోర్డు మారింది. ఎన్నికల పోటీల్లో 169 మంది రైతులు నామినేషన్లు వేసి సంచలనం సృష్టించారు.
కొత్త వ‌్యవస్థను తీసుకొస్తాం: అర్వింద్
కాగా పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ అర్వింద్ స్పందించారు. పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థను కేంద్రం తీసుకురాబోతోందని ఎంపీ అర్వింద్ అన్నారు. దేశంలో చాలా బోర్డులు ఉన్నాయని.. అయినా రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానన్న వాగ్దానం అర్వింద్‌ది కాదని, అది బీజేపీ వాగ్దానమని చెప్పారు. కొత్త వ్యవస్థ తెలంగాణ కేంద్రంగానే పనిచేస్తుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా రైతులు నేరుగా తమ పంటలను విదేశాలకు ఎగుమతి చేసుకొవచ్చని తెలిపారు.
రైతులను రెచ్చగొట్టేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పసుపు రైతులతో తనకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారానే టైస్, క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు టైస్ ద్వారా బోర్డు కంటే మెరుగైన లాభాలు వస్తాయని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. పసుపు క్షేత్రస్థాయి పంట కావడం వల్ల మద్దతు ధరను రాష్ట్రాలే ప్రతిపాదిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో పసుపుకు చంద్రబాబు మద్దతు ధర ఇవ్వగా.. ఇప్పుడు సీఎం జగన్ కూడా పసుపు, మిర్చికి మద్దతు ధర ఇస్తున్నారని అర్వింద్ చెప్పుకొచ్చారు.