ఏపీ హైకోర్టుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
By సుభాష్ Published on 1 Oct 2020 10:52 AM GMTఓ కేసులో ఏపీ హైకోర్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తుళ్లూరు మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్‌బాబు కేసును వారంలోగా తేల్చాలని ఏపీ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. కేసును మూడు వారాల తరువాత విచారణ చేపట్టడానికి వాయిదా వేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో కేసు ఏమిటని హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందని సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తుపై స్టే విధించవద్దని అనేక సార్లు చెబుతూ వస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని కీలక వ్యాఖ్యలు చేసింది.
కాగా, అమరావతి భూ కుంభకోణంలో మాజీ తహసీల్దార్ సుధీర్‌బాబు సహా పలువురిపై సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు అసాధారణ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వచ్చే వారం ఈ అంశంపై విచారణ ముగించాలని సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.