వెంకన్న వెబ్‌సైట్‌లో యేసయ్య ప్రత్యక్షం..!

By అంజి  Published on  1 Dec 2019 6:26 AM GMT
వెంకన్న వెబ్‌సైట్‌లో యేసయ్య ప్రత్యక్షం..!

ముఖ్యాంశాలు

  • మరోసారి అన్యమత ప్రచారం కలకలం
  • టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత కామెంట్లు
  • అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
  • విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన ఈవో సింఘాల్‌

తిరుపలి: తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ ఎదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో అన్యమత కామెంట్లు కనపడడం వివాదాస్పదంగా మారింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో క్యాలెండర్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న కొందరు భక్తులకు.. అందులో శ్రీయేసయ్య అని కనపడడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Ttd

2019-20 వికారి నామ సంవత్సర టీటీడీ పంచాంగం కనిపించింది. దానిపై క్లిక్‌ చేయగా శ్రీ యేసయ్య! శ్రీవెంకటేశాయనమః శ్రీ వికార నామ సంవత్సర సిద్ధాన్త పంచాబ్దము అని కనబడింది. కాగా ఒక్కసారిగా అన్యమత పదాలు కనబడడంతో భక్తులు వీస్తుపోయారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం టీటీడీ కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అన్యమత పదాలు కనిపించడంపై అధికారులను భక్తులు నిలదీస్తున్నారు. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేలా అధికారులు వ్యహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత పదాలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అన్యమత పదాలపై టీటీడీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

వెబ్‌సైట్‌లో ఉన్న కొత్త క్యాలెండర్‌ పీడీఎఫ్‌ను టీటీడీ అధికారులు శనివారం ఉదయం వెంటనే తొలగించారు. వెబ్‌సైట్‌లో కొత్త క్యాలెండర్‌ను అప్‌లోడ్‌ చేయలేదని, పాత క్యాలెండర్‌లో అన్యమత కామెంట్‌ ఉందని టీటీడీ అధికారులు గుర్తించారు. టీటీడీ వెబ్‌సైట్‌ను ఎలక్ట్రానికి్‌ డేటా ప్రాసెసింగ్‌, టీసీఎస్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై టీటీడీ ఈవో సింఘాల్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వెబ్‌సైట్‌లోని అన్యమత పదాలు ఎలా వచ్చాయన్న దానిపై విచారిస్తున్నామని విజిలెన్స్‌ అధికారి శివకుమార్‌ రెడ్డి తెలిపారు.

టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారిని టీటీడీ జేఈవో బసంత్‌ కుమార్‌ అన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో నిరంతర పర్యవేక్షణలో ఉంటుందని.. అయినా పంచాంగంలో అన్యమత పదాలు రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ ఘటనపై టీటీడీ ఐటీ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నామని జేఈవో బసంత్‌ కుమార్‌ తెలిపారు.

Next Story