మరో రెండు చోట్ల శ్రీవారి ఆలయ నిర్మాణాలు.. టీటీడీ బోర్డు ఆమోదం

By సుభాష్  Published on  29 Dec 2019 4:41 AM GMT
మరో రెండు చోట్ల శ్రీవారి ఆలయ నిర్మాణాలు.. టీటీడీ బోర్డు ఆమోదం

ముఖ్యాంశాలు

  • జమ్మూతోపాటు, వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆమోదం

  • టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు నియామకం

  • సైబర్‌ సెక్యూరిటీ ఏర్పాటుకు బోర్డు ఆమోదం

  • సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేదం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019-20 వార్షిక బడ్జెట్‌ రూ.3,243 కోట్లకు ఆమోదం తెలిపింది. అలాగే లడ్డూ ప్రసాదాలపై ఏటా రూ. 200 కోట్లను టీటీడీ సబ్సిడీగా ఇస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. అలాగే జమ్మూకశ్మీర్‌ లో కూడా శ్రీవారి ఆలయం నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా ఉన్నాయని, వాటిని బోర్డు ఆమోదం కూడా తెలిపిందని చైర్మన్‌ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు తిరుమల ఆలయ నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని కేటాయించాల్సిందిగా జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అలాగే ముంబై నగరంలో ఆలయ నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే తిరుమలలో సదుపాయల కల్పనకు నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. శ్రీవరాహస్వామి ఆలయ గోపుర బంగారు తాపడానికి రూ. 14 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇక తిరుమలఘాట్‌ రోడ్డు మరమ్మతులకు రూ. 8 కోట్లు, తిరుపతిలో కల్యాణ మండపాల్లో ఏసీ ఏర్పాటుకు రూ. 3.4 కోట్లు, పరిపాలన భవనానికి మరమ్మతులు చేసేందుకు రూ. 14 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అలాగే తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, ఆగమ సలహమండలి సభ్యుడిగా ఉన్నరమణ దీక్షితులను గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో సంక్రాంతిలోపు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నట్లు చెప్పారు. ఇక సైబర్‌ సెక్యూరిటీ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది.

Next Story