మరో వివాదంలో టీటీడీ.. కుశుడు సీతమ్మ కన్నకొడుకు కాదా .?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 7:44 PM IST
మరో వివాదంలో టీటీడీ.. కుశుడు సీతమ్మ కన్నకొడుకు కాదా .?

టీటీడీ.. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్నేళ్లుగా ఏడు భాషల్లో సప్తగిరి మాసపత్రికను ప్రచురిస్తోంది. ఈ పత్రికలో రామాయణం, మహాభారతంలో పాటు ఇతర పురాణ కథలు, చిన్నారుల ప్రతిభను గుర్తించే కథలను ప్రచురిస్తుంటుంది టీటీడీ. ఈసారి జూన్ లో విడుదల చేసిన మాసపత్రికలోని 41వ పేజీలో ప్రచురితమైన జానపద కథలో సీతారాములకు లవుడు ఒక్కడే కొడుకని, కుశుడు సీతమ్మకు పుట్టిన కొడుకు కాదని అర్థం చెప్పేలా ఓ కథ ప్రచురితమైంది.

ఆ కథలో కుశుడు సీతకు కన్న కొడుకు కాదని, దర్భతో చేసిన బొమ్మ నుంచి కుశుడు ఉద్భవించాడని, కుశుడు సీతారాములకు జన్మించకపోయినా..లవునికి కవల సోదరుడిగా మాత్రం అందరి మన్ననలను అందుకున్నాడని ఆ కథలో ప్రచురించారు. ఈ కథ రాసింది తిరుపతి చెందిన 9వ తరగతి విద్యార్థి . ఈ కథ చదివిన భక్తులంతా టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణంపై టీటీడీ ఇలాంటి కథలు ప్రచురించడంపై అసహనం చెందారు. అలాగే స్థానిక బీజేపీ నేతలు సైతం టీటీడీని తప్పు పట్టారు. అసలు తప్పెక్కడ జరిగిందో తెలుసుకుని, వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.

మాసపత్రిక ఎడిటర్ పై టీటీడీ ఆగ్రహం

రామాయణాన్ని వక్రీకరిస్తూ సప్తగిరి మాసపత్రికలో ప్రచురితమైన జానపద కథ పై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో టీటీడీ స్పందించింది. కథనం ప్రచురితమవ్వడానికి బాధ్యులైన వారిపై విజిలెన్స్ కు ఆదేశించింది. దీంతో సంబంధిత మహిళా సబ్ ఎడిటర్ విజిలెన్స్ కు వివరణ ఇచ్చారు. తనవైపు నుంచి ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలని కోరారు. తదుపరి విచారణకు సప్తగిరి మాసపత్రిక ఎడిటర్, చీఫ్ ఎడిటర్ హాజరు కావాలంటూ అధికారులు ఆదేశించారు.

Next Story