జగన్ సర్కారుకు వెంకన్న భూముల వేలం చిక్కు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 May 2020 10:17 AM GMT
జగన్ సర్కారుకు వెంకన్న భూముల వేలం చిక్కు

ఎజెండా స్పష్టంగా ఉన్నప్పుడు.. మిగిలిన విషయాలేవీ పట్టించుకోకపోవటం ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఏపీ సర్కారు ఉందా? అన్నది సందేహంగా మారింది. వేలెత్తి చూపించేటోళ్లు ఎక్కువైనప్పుడు సహజంగా ఏం చేస్తారు ఎవరైనా? ‘‘ప్రతిసారీ టార్గెట్ నేనే ఎందుకు అవుతున్నాను’’ అన్న ఆత్మశోధన జరుగుతుంది. ఏపీ ప్రభుత్వ పరిస్థితి చూస్తే అలాంటిదేమీ కనిపించదు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున వివాదాలు చుట్టుముడుతున్నా.. వాటిని ఖాతరు చేయకుండా నిర్ణయాలు తీసుకోవటం కనిపిస్తుంది. తాజాగా తెర మీదకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం భూముల వేలం ఉదంతం తెలుగు నేల మీద హాట్ టాపిక్ గా మారింది.

ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. పెద్దాయనతో అస్సలు పెట్టుకోకూడదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి హెచ్చరికలేవీ తమకు పట్టవన్నట్లుగా ఏపీ సర్కారు తీరు ఉందన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. నిజంగానే టీటీడీ భూములు అమ్మటం అంత దుర్మార్గమైన విషయమా? హద్దులు దాటేసే బరితెగింపునకు టీటీడీ పాల్పడుతుందా? అన్న ప్రశ్నలకు సాపేక్షంగా సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. లేని ఈకలు పీకటం అలవాటుగా మారిందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీడియా మొత్తం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలకు తగ్గట్లే కొన్ని వాస్తవాల్ని ప్రస్తావించటం లేదంటున్నారు. టీటీడీ చరిత్రలో భూముల అమ్మకం జగన్ ప్రభుత్వంతోనే మొదలైందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే లేదనే మాట వినిపిస్తుంది. మరింత వివరంగా చెప్పాలంటే టీటీడీ భూముల్ని 1974లోనే అమ్మారన్న వాస్తవాన్ని విస్మరించకూడదు.

అంతేనా.. 2014లో బాబు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. 2015లో టీటీడీ భూముల్ని అమ్మేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. అమ్మాల్సిన భూముల లెక్క తేల్చేందుకు ఏకంగా కమిటీని వేశారు. పలు సమావేశాల అనంతరం.. భూముల అమ్మకాలకు రంగం సిద్ధం చేయగా.. అప్పటి ప్రభుత్వాధినేత సూచనతో టీటీడీ వెనక్కి తగ్గిందని చెబుతారు. భూముల అమ్మకాలపై గత నెల 30న టీటీడీ చేసిన తీర్మానం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిందంటూ హడావుడి చేస్తున్న మీడియా.. భూముల అమ్మకాలు ఇదే తొలిసారి అన్నట్లుగా ఎందుకంత యాగీ చేస్తుందన్న వాదనను పరిగణలోకి తీసుకోవాల్సిందే.

టీటీడీ భూములు అమ్మకానికి పెట్టేయాల్సిన అవసరం ఉందా? అన్నది విషయంలోకి వెళ్లినప్పుడు లేదనే చెప్పాలి. స్వామివారి మీద అచంచల ప్రేమాభిమానాలతో తాము సంపాదించిన ఆస్తుల్ని స్వామివారికి కట్టబెట్టే నమ్మకానికి విఘాతం కలిగించేలా టీటీడీ నిర్ణయం తీసుకోవటం మీదనే అసలు అభ్యంతరమంతా.

అదే సమయంలో భూముల ద్వారా టీటీడీకి వచ్చే ఆదాయం రూ.1.3కోట్లకు మించే అవకాశం లేదన్న మాట విన్నప్పుడు విస్మయానికి గురి కావాల్సిందే. అంత తక్కువ మొత్తం కోసం ఇంత రచ్చ అవసరమా? అన్నసందేహం రాక మానదు. సమస్యలు లేనప్పుడు కొత్త సమస్యల్ని ఆహ్వానించేలా నిర్ణయాలు ఉండటానని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. కానీ.. గొంతుల వరకూ సమస్యలతోనూ.. వివాదాలతో మునిగిన వేళ.. మరో కష్టాన్ని నెత్తిన వేసుకోవటం అవసరమా? అన్నది అసలు ప్రశ్న. ఏ ఆలోచనతో భూముల అమ్మకాలకు టీటీడీ తెర తీసిందో కానీ.. నిందలు మాత్రం ఏపీ ప్రభుత్వానికి తప్పట్లేదు.

Next Story