చెల్లని నాణేలను సెయిల్‌కి తూకం వేసి అమ్మేస్తున్న టీటీడీ

By అంజి  Published on  27 Jan 2020 8:19 AM GMT
చెల్లని నాణేలను సెయిల్‌కి తూకం వేసి అమ్మేస్తున్న టీటీడీ

ముఖ్యాంశాలు

  • విలువలేని నాణేలను కూడా హుండీలో వేస్తున్న భక్తులు
  • టిటిడిలో 90 వేల బ్యాగుల్లో పోగుపడ్డ చెల్లని నాణేలు
  • వీటి విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా
  • వీటిని మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ కు అర్జీ
  • కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించమని రిజర్వ్ బ్యాంక్ సూచన
  • నాణేలను తూకం వేసి సెయిల్ కి అమ్మేందుకు ఏర్పాట్లు

తిరుపతి: వడ్డికాసులు వాడు ఇప్పుడు తనకు భక్తులు హుండీలో సమర్పించిన నాణేలను ఇష్టంగా స్వీకరిస్తాడు. భక్తులు ఆయనకు ఒక్క రూపాయి కానుకను భక్తితో సమర్పించినా ఆదరంగా స్వీకరించి వాళ్లను ప్రేమతో అక్కునజేర్చుకుని లాలించి పాలిస్తాడు. ఇది భక్తుల మదిలో బలంగా పాతుకుపోయిన విశ్వాసం. ఈ విశ్వాసం ఈ నాటికికాదు. తరతరాలుగా, కలియుగంలో స్వామి ఇలవైకుంఠపురమైన తిరుమలకొండపై వెలసిననాటినుంచీ భక్తుల మదిలో బలంగా పాతుకుపోయింది.

అదే విశ్వాసంతో భక్తులు తరాలనాటినుంచీ తమ దగ్గర ఉన్న నాణేలను భక్తితో స్వామికి హుండీలో కానుకగా సమర్పిస్తుంటారు. అయితే వీటిలో ఇప్పుడు చెలామణీలోలేని నాణేలుకూడా ఇబ్బడిముబ్బడిగా ఉంటున్నాయి. వాటిని ఎవరికీ ఇవ్వడానికీ లేదు, ఎక్కడా చెలామణీ చేయడానికీ లేదు. కేవలం వాటిని ఆ నాణేలను తయారు చేసిన లోహాలకు మార్పిడిగా తూకం రూపంలో అమ్మడం తప్ప.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అదే పని చేస్తున్నారు. స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియాకు ఆ నాణేలను తూకం వేసి అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 85 టన్నుల చెల్లని నాణేలు ఇలా టిటిడి దగ్గర పోగుపడ్డాయి. వీటిని తూకంవేసి లోహంగా మాత్రం అమ్మడానికే వీలవుతుంది.

ప్రపంచంలోకెల్లా అత్యంత మహిమాన్వితమైన ఆలయంగా, ధనిక ఆలయంగా పేరుపొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు దాదాపుగా 90 వేల బ్యాగుల్లో ఇలాంటి నాణేలు పోగుపడ్డాయి. దాదాపుగా వీటి విలువ అవి మనుగడలో ఉన్నట్టైతే 30 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. కానీ ఇప్పుడా నాణేలు మనుగడలో లేవు కనుక వాటి ఎలాంటి విలువా లేదు కనుక సెయిల్ కి అప్పగించడం మినహా మరో మార్గం లేదు.

2001లో పావలా బిళ్లల్ని, అంతకంటే తక్కువ విలువ కలిగిన నాణేలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లని నాణేల కింద ప్రకటించింది. అప్పట్లో వాటిని కొత్త డినామినేషన్లలోకి మార్చుకునే సదుపాయాన్నికూడా కల్పించింది. కానీ అలా మార్చుకోలేనివాళ్లు, తమ దగ్గర అలాగే ఆ నాణేలను ఉంచేసుకున్నవాళ్లు వాటిని తీసుకొచ్చి నేరుగా స్వామివారి హుండీలో వేస్తున్నారు.

ఫిబ్రవరి 2014వరకూ తిరుమల తిరుపతి దేవస్థానంతో లావాదేవీలు జరిపే నేషనలైజ్డ్ బ్యాంకులన్నీ ఇలా విలువ కోల్పోయిన నాణేలను టిటిడినుంచి తీసుకుని వాటికి ప్రతిగా చెలామణీలో ఉన్న కరెన్సీని ఇస్తూ ఉండేవి. ఆ తర్వాత అవికూడా వాటిని తీసుకోవడం మానేశాయి.

మార్చడం వీలుకాదని తేల్చి చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ

ఆ బ్యాంకులకు కూడా ఇలాంటి నాణేలు పెద్ద మొత్తంలో పోగుపడినప్పుడు వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు. కొంతకాలంపాటు స్వామివారికి సేవచేసుకుంటున్న భావనతో ఆ బ్యాంకులు వాటిని స్వీకరించినప్పటికీ స్థాయిని మించిన మొత్తాల్లో అవి పేరుకు పోవడంవల్ల, పోగు పడడంవల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో స్వీకరించడం మానేశాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చెల్లని నాణేలను చెలామణీలో ఉన్న కరెన్సీలోకి మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సంప్రదించింది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించాల్సిందిగా కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అలా చెల్లని నాణేలను చలామణీలో ఉన్న కరెన్సీకి మార్చడానికి వీలు కాదని తేల్చి చెప్పింది. ఈ నేపధ్యంలో టిటిడి వాటిని సెయిల్ కి తూకం వేసి అమ్మేందుకు నిర్ణయం తీసుకుంది.

Next Story