ఆర్టీసీ సమ్మెకు ప్రజల మద్ధతు లేదు- మంత్రి గంగుల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2019 11:53 AM GMT
ఆర్టీసీ సమ్మెకు ప్రజల మద్ధతు లేదు- మంత్రి గంగుల

కరీంనగర్‌: బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఎక్కడ టెంట్‌ కనపడితే అక్కడ ఉడుముల్లాగా చేరి.. ఆర్టీసీ కార్మికులను తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. ఆదివారం జిల్లాలో మంత్రి కమలాకర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ల కోసం చేపట్టిన ఆర్టీసీ సమ్మెను కొంతమంది సీఎం కేసీఆర్‌పై తమకున్న ఈర్ష్యను తీర్చుకునేందుకు ప్రయత్రిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల్లో అంతర్మథనం మొదలైందని, యూనియన్‌ నాయకుల వెనుక ఒక్కో రాజకీయ పార్టీ ఉందని పేర్కొన్నారు.

కార్మికుల 26 డిమాండ్లలో యూనియన్‌ నాయకులు కేవలం విలీనంపైనే ఎందుకు పట్టుబట్టి కూర్చున్నారని నిలదీశారు. ఏ రోజూ స్టీరింగ్‌ పట్టని యూనియన్‌ నేతలు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల అభిప్రాయ పడ్డారు. కాగా ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తోందని మంత్రి గంగుల అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 44 శాతం ఫిట్‌ మెంట్‌ ఇచ్చామన్నారు. ఆర్టీసీ సమ్మెకు ప్రజల మద్ధతు లేదని గంగుల కమలాకర్‌ అన్నారు.

Next Story