తెలంగాణలో విద్యా సంస్థలు ఇప్పుడే తెరవలేం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
By సుభాష్ Published on 8 Oct 2020 4:57 AM GMTకరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలన్ని మూత పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఈనెల 15 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం సాధ్యం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ విద్యాసంస్థల పునః ప్రారంభంపై జరిగిన సమావేశంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డితోపాటు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా పండగల తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేరళలో ఓనం పండగ అనంతరం కరోనా మళ్లీ తీవ్రతరం దాల్చినందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూజీసీ, ఏఐసీటీయూ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కళాశాలలు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. పండగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు అధికారులు విధి విధానాలను రూపొందించాలని, వాటి ఆధారంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల నిర్వహణపై విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖలు సమన్వయంతో నిబంధనలు రూపొందించాలన్నారు. ఇప్పటి వరకు సెలవులున్నందున విద్యార్థుల దృష్టి చదువున ఉంచి దారి మళ్లకుండా చూడాల్సి ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 96 శాతం మందికి టీవీలున్నాయి. 40 శాతం మందికి నెట్ సదుపాయం ఉంది. 86 శాతం మందికి ఆన్‌లైన్ విద్య అందుతుందని ఓ సర్వే ద్వారా తేలిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 50 శాతం విద్యార్థులు ఒకరోజు హాజరైతే మిగిలిన వారికి ఆన్‌లైన్ ద్వారా బోధించాల్సి వస్తుందని, రానున్న కాలంలో విద్యార్థులకు డిజిటల్ బోధన తప్పనిసరి అని అన్నారు. పాఠశాలల్లో వసతి నిర్వహణ స్థానిక సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో దానిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల ప్రారంభమైన తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.