కీలక నిర్ణయం: తెలంగాణ రవాణా శాఖలో మరో ఆరు సేవలు ఆన్‌లైన్‌తో అనుసంధానం

By సుభాష్  Published on  5 Sept 2020 11:45 AM IST
కీలక నిర్ణయం: తెలంగాణ రవాణా శాఖలో మరో ఆరు సేవలు ఆన్‌లైన్‌తో అనుసంధానం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్దరణ, లైసెన్స్ లో చిరునామా మార్పులు, ఇతర వాహనాల లైసెన్స్‌ పొందడం, గడువు ముగిసిన లెర్నర్స్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్త లైసెన్స్‌ పొందడం, అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసినా తిరిగి కొత్తది పొందడం తదితర ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు.

వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి ఈ సేవలు పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఒక ప్రకటనలోతెలిపారు.

కాగా, జూన్‌ 24న డూప్లికేట్‌లెర్నర్‌ లైసెన్స్‌, పాత లైసెన్స్‌ కార్డు స్థానంలో స్మార్ట్‌ కార్డు పొందడం, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏజెంట్ల ప్రమేయంలేకుండా గంటల తరబడి కార్యాలయాల్లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని ఆయన వెల్లడించారు. దీనికి మంచి స్పందన కూడా వస్తోందన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇలాంటి సులభమైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్న సేవలకు మరో ఆరు సేవలను చేర్చామని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఇలాంటి సులభమైన ఆన్‌లైన్‌ సేవల వల్ల వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

Next Story