మరో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు
By సుభాష్ Published on 6 Oct 2020 5:30 PM ISTతెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఒడిశా నుంచి దక్షిణ కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, అక్టోబర్ 9వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని, ఈ కారణాలతో తెలంగాణకు వర్షసూచన కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో మరోసారి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఒడిశా పరిసర ప్రాంతాల వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 9న ఏర్పడే మరో అల్పపీడనం ఏర్పడి అది 24 గంటల వ్యవధిలో వాయువ్య దిశగా ప్రయాణం చేసి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆయన వివరించారు.