హత్రాస్‌ ఘటన: అందుకే యువతి శవాన్ని అర్థరాత్రి దహనం చేశాం: యూపీ ప్రభుత్వం

By సుభాష్  Published on  6 Oct 2020 11:27 AM GMT
హత్రాస్‌ ఘటన: అందుకే యువతి శవాన్ని అర్థరాత్రి దహనం చేశాం: యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యాచారాల కేసుల్లో యూపీ మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కామాంధుల అగడాలకు ఏ మాత్రం హద్దు.. అదుపు లేకుండా పోతోంది. అయితే రాష్ట్రంలో హత్రాస్‌లో ఓ యువతిపై నలుగురు అత్యాచారం జరపగా, ఆమె ఆస్పత్రిలో చికిత్స ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన పెద్ద దుమారం రేపుతోంది. అయితే మృతిరాలికి అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడంతో యూపీ పోలీసుల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణాలను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున, ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదికతో తాము ఈ విధంగా అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చిందని బదులిచ్చింది. అర్ధరాత్రి 2.30 గంటలకు ఎందుకు దహన చేయాల్సి వచ్చిందో కూడా తన అఫిడవిట్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వివరించింది.

బాబ్రీ మసీదు తీర్పు నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్‌ విధించారని, ఈ నేపథ్యంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న భావనతో అర్ధరాత్రి దహణం చేసినట్లు తెలిపింది. సఫ్దర్‌ గంజ్‌ ఆస్పత్రిలో సెప్టెంబర్‌ 29న జరిగిన ధర్నా గురించి ఇంటెలిజెన్స్‌ నివేదిక వచ్చిందని, ఆ ఘటన కులం రంగు పూశారని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. మరో వైపు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం హత్రాస్‌ క్రైమ్‌సీన్‌కు వెళ్లి సమాచారం సేకరిస్తోంది.

ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం తన పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరింది. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ విచారణ సాగాలని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పదోవ పట్టించేలా ప్రచారం జరుగుతోందని అఫిడవిట్‌లో యోగి ప్రభుత్వం ఆరోపించింది. అర్ధరాత్రి సమయంలో మృతురాలిని దహనం చేసేందుకు ఆమె తల్లిదండ్రులను జిల్లా అధికారులు ఒప్పించినట్లు అఫిడవిట్లో పేర్కొంది.

Next Story
Share it