తెలంగాణ సచివాలయ కొత్త భవనం డిజైన్‌ విడుదల

By సుభాష్  Published on  7 July 2020 10:29 AM IST
తెలంగాణ సచివాలయ కొత్త భవనం డిజైన్‌ విడుదల

తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈరోజు సి-బ్లాక్‌ భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు అధికారులు. అయితే కొత్త సచివాలయ భవనం డిజైన్‌ కూడా విడుదలైంది. త్వరలో డిజైన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేయనున్నారు. పాత సచివాలయ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త సచిఆవలయం నిర్మించడానికి వీలుగా పాత భవనం కూల్చివేస్తున్నారు. అయితే తెలంగాణ సచివాలయ కూల్చివేతకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు నుంచి అనుమతులు రావడంతోనే కూల్చివేత ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.

అయితే ఈ నెలాఖరులోగా సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియ పూర్తి చేసి శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్‌ ప్రభుత్వం యోచిస్తోంది.

కాగా, కొత్త సచివాలయ భవనం నిర్మాణానికి ఎప్పుడో పునాది పడాల్సి ఉండేది. కాని సచివాలయ భవనం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ దాఖలైన కారణంగా భవనం కూల్చివేత పనులు కాస్త వాయిదా పడ్డాయి. కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ కొనసాగింది. అందుకు ప్రస్తుతం ఉన్న సచివాలయం ఇప్పుడున్న అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని, పాలన పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగా పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసి కొత్త సచివాలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తరపున కోర్టులో వాదనలు కొనసాగాయి. ఇక అటు పిటిషనర్‌ తరపున, ఇటు ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు ఎట్టకేలకు పాత భవనం కూల్చివేతకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

దీంతో కోర్టు నుంచి అనుమతులు వచ్చిన వెంటనే మంగళవారం నుంచి ప్రభుత్వం కూల్చివేత ప్రక్రియ ప్రారంభించింది. మొదటగా సి-బ్లాక్‌ భవనాన్ని కూల్చివేత పనులు ప్రారంభించిన నేపథ్యంలో అటు వైపు వచ్చే వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు పోలీసులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సెక్రెటరియేట్‌ భవనం ఇక కనుమరుగు కానుంది. కూల్చివేత దృష్ట్యా ఇప్పటికే సచివాలయంలో ఉన్న అన్ని శాఖలను ఇతర భవనాల్లోకి మార్చిన విషయం తెలిసిందే.

Next Story