తెలంగాణ ఎస్ హెచ్ ఆర్ సీ చైర్మన్, తొలి లోకాయుక్త నియామకం
By రాణి Published on 20 Dec 2019 7:01 AM GMTముఖ్యాంశాలు
- తెలంగాణ ఎస్.హెచ్.ఆర్.సీ చైర్మన్ నియామకం
- జస్టిస్ జి.చంద్రయ్య కొత్త ఎస్.హెచ్.ఆర్.సీ చైర్మన్
- తెలంగాణ తొలి లోకాయుక్త నియామకం
- జస్టిస్ సి.వి.రాములు తెలంగాణ తొలి లోకాయుక్త
- ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్.హెచ్.ఆర్.సీ చైర్మన్ పదవి
- ఏళ్లుగా ఖాళీగా ఉన్న తెలంగాణ లోకాయుక్త పదవి
- వెంటనే నియామకాలు జరపాలని హైకోర్ట్ ఆదేశం
- డిసెంబర్ 30, 2019లోగా నియామకాలు జరపాలని ఆదేశం
- హై కోర్ట్ ఆదేశాలను పాలించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ పూర్వ ఎస్.హెచ్.ఆర్.సి చైర్మన్ నిస్సార్ అహ్మద్ ఖరూ పదవీకాలం 2016లో పూర్తయ్యింది. తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ప్రత్యేకంగా అధిపతంటూ ఎవరూలేరు. చాలాకాలంపాటు ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జస్టిస్ జి.చంద్రయ్యను ఎస్.హెచ్.ఆర్సీ చైర్మన్ గా నియమించింది. ఈయన పూర్వ హైకోర్ట్ న్యాయమూర్తి. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిననాటినుంచీ తెలంగాణకు లోకాయుక్త లేరు. పూర్వ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.రాములును తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు లోకాయుక్తగా నియమించింది. పూర్వ న్యాయకార్యదర్శి వి.నిరంజన్ రావ్ ని ఉప లోకాయుక్తగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థకు చెందిన ఈ అత్యున్నత పదవులు ఖాళీగా ఉండడాన్ని సీరియస్ గా తీసుకున్న హైకోర్ట్ నవంబర్ 29వ తేదీన డిసెంబర్ 30వ తేదీలోగా నియామకాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర మానవహక్కుల సంఘం అధ్యక్షుడినీ, లోకాయుక్తనూ నియమించింది. దీంతోపాటుగా ఎన్.ఆనందరావ్, మొహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ లను రాష్ట్ర మానవహక్కుల సంఘం సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. వీరి నియామకాలను సిఫారసు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని నియామకాల కమిటీ గవర్నర్ కు నివేదించింది.
జస్టిస్ సి.వి.రాములు వయసు 70 సంవత్సరాలు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని అచ్చంపల్లి గ్రామంలో జన్మించారు. 1978లో ఔరంగాబాద్ లోని మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన యశ్వంత్ లా కాలేజీనుంచి ఎల్.ఎల్.బీ డిస్టింక్షన్ లో పాసయ్యారు. 24 సంవత్సరాల అనుభవంలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎ.పి.ఎస్.ఆర్టిసికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా సేవలందించారు. | జస్టిస్ జి.చంద్రయ్య వయసు 65 సంవత్సరాలు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బి, ఎమ్మే పొలిటికల్ సైన్స్, ఎల్.ఎల్.ఎమ్ చేశారు. 1980లో ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2005లో ఏపీ హైకోర్ట్ అదనపు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2006లో ఏపీ హైకోర్ట్ పర్మనెంట్ జడ్జ్ గా నియమితుల్యయారు. 2016లో పదవీవిరమణ చేశారు. ఆదిలాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. |
ప్రభుత్వం చేసిన సిఫారసులను గవర్నర్ తమిల్ ఇసై సౌందర రాజన్ ఆమోదించారు. నియామకాల కమిటీలో ప్రతిపక్ష నేతలు కూడా సభ్యులు. ఎమ్.ఐ.ఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందుబాటులో లేని కారణంగా ఆయన తరపున పార్టీలోని కీలక నేత నియామక సంఘ సమావేశానికి హాజరయ్యారు. శాసనమండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్.ఐ.ఎమ్ శాసనసభ్యుడు మొహమ్మద్ పాషా ఖాద్రి, ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ హసన్ జఫ్రీ ఈ సమావేశానికి హాజరయ్యారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పోస్టులు ఖాళీగా ఉన్నందున హైకోర్ట్ వెంటనే ఈ ఖాళీలను పూరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా ప్రభుత్వం తెలంగాణ లోకాయుక్త చట్టం 1983కి సవరణ చేసి ఈ నియామకాలు చేసింది. రిటైర్డ్ జడ్జ్ ని లోకాయుక్తగా నియమించేందుకు ఈ చట్టానికి సవరణ చేయాల్సి వచ్చింది.
చట్టంలో పదవీ విరమణ చేసిన హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని మాత్రమే లోకాయుక్తగా నియమించాలని ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ చేసి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అనే షరతును హైకోర్ట్ న్యాయమూర్తిగా మార్చిన తర్వాత నియామకాలు చేయడం జరిగింది.