డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టులో విచారణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Sep 2020 10:27 AM GMT
డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా హాస్టల్స్‌ మూసి ఉన్నందున్న పరీక్షలు నిర్వహించినట్లయితే.. విద్యార్థులు ఇబ్బందులు పడతారని, చివరి సెమిస్టర్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆన్‌లైన్‌ లో పరీక్షలు నిర్వహించగలరా..? సప్లిమెంటరీలో పాసైన విద్యార్థులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా..? సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. ప్రభుత్వాన్ని అడిగి చెబుతామని బదులిచ్చారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15 కి వాయిదా వేసింది.

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈనెల 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు.. ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్‌, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

Next Story