తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం: 2019-20 విద్యా సంవత్సరంలో కీలక మార్పులు

By సుభాష్  Published on  19 Jun 2020 8:37 AM IST
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం: 2019-20 విద్యా సంవత్సరంలో కీలక మార్పులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు సైతం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019-20 విద్యాసంవత్సరం మరింత ఆలస్యంగా కానుంది. దీంతో విద్యార్థుల చదువులను దృష్టిలో ఉంచుకుని 2019-20 విద్యా సంవత్సరంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

గత మూడు నెలలకుపైగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా వార్షిక పరీక్షలు నిర్వహించే ఏప్రిల్‌, మే నెలల్లో విద్యాసంస్థలు మూతపడటంతో పరీక్షలు సైతం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత పరిస్థితుల్లోనూ విద్యాసంస్థలను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నష్టపోయిన విద్యార్థులు ఇక నుంచి మరింత నష్టపోకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాలని భావించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని పలు పాఠశాలలు ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేందుకు సిద్దంకాగా, ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా యూ ట్యుబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ డీఈవో తెలిపారు.

జూన్‌ చివరి వరకూ ఏర్పాటు చేసిన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా తరగతులు బోధించేందుకు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా పదో తరగతి విద్యార్థులతో క్లాసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత మిగతా తరగతులకు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఆన్‌లైన్‌ పాఠాల కోసం ఓ వెబ్‌ సైట్‌ను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం.

Next Story