50 వేల కరోనా టెస్టులు: కేసీఆర్

By సుభాష్  Published on  15 Jun 2020 11:48 AM IST
50 వేల కరోనా టెస్టులు: కేసీఆర్

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. పది రోజుల్లో ఐదు జిల్లాల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ఆదివారం ఉన్నతస్థాయి సమావేశమైన కేసీఆర్‌.. కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలలో ఈ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.

అలాగే ప్రైవేట్‌ ల్యాబరేటరీలు, ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్‌ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మరణాల రేటు తక్కువగా, కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదవుతుందని అన్నారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌లు నమోదవుతున్నాయని అన్నారు. ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలున్నాయని పేర్కొన్నారు.

Next Story