హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అత్యవసర, అత్యన్నత సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా లాక్‌డౌన్‌ అమలు, కరోనాపై ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారని సమాచారం. తెలంగాణలో కరోనా కేసులు అధికమవుతున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖల అధికారులతో సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టపై చర్యలు, రైతుల పంటల కొనుగోళ్లే ప్రధాన అజెండాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన శాఖల ముఖ్యకార్యదర్శులు కూడా సమీక్షలో పాల్గొననున్నారు.

లాక్‌డౌన్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందజేత, పంటల కొనుగోళ్ల ఇబ్బందులపై చర్చలు జరుపుతారు. అలాగే కరోనా కట్టడిపై చైతన్య పరిచే కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెల్ల రేషన్‌ కార్డు దారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంపై సీఎం కేసీఆర్‌ సూచనలు చేయనున్నారు.

Also Read: వారి కోసం.. జిల్లాల్లో క్వారంటైన్‌ కేంద్రాలు 

‘వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మార్కెట్‌ కమిటీలన్నీ బంద్‌.. రైతులు ఎవరూ రావొద్దని’ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సూచించారు. ఇందుకోసం ఇప్పటికే పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈసారి ఏకంగా 6,700 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Also Read: నయమైనా.. 8 రోజుల దాకా.. 

‘రాష్ట్ర‌వ్యాప్తంగా 50ల‌క్ష‌ల పైచిలుకు ఎక‌రాల్లో పంట‌లు చేతికొచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. క‌చ్చితంగా దాన్ని కాపాడుకోవాలి’ అంటూ గత ప్రెస్‌ మీట్‌లో సీఎం కేసీఆర్‌ అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.