హైదరాబాద్‌: నేడు మంత్రివర్గ భేటీ.. ఈ అంశాలపైనే చర్చ

By సుభాష్  Published on  18 May 2020 2:06 AM GMT
హైదరాబాద్‌: నేడు మంత్రివర్గ భేటీ.. ఈ అంశాలపైనే చర్చ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గినా..హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మే 29 వరకూ లాకక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నుంచి పలు సడలింపుల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో సోమవారం మంత్రివర్గం సమావేశం కానుంది.

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ 4.0 ను మే 31 వరకూ పొడిగిస్తూ.. కొత్తమార్గదర్శకాలు విడుదల చేయడంతో .. తెలంగాణలో కూడా ఏఏ అంశాలపై సడలింపులు ఇవ్వాలనేదానిపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే సమావేశం అత్యంత కీలక కానుంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గిపోవడం, హైదరాబాద్‌లో కూడా నాలుగు చోట్ల మాత్రమే కరోనా కేసులుండటంపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై చర్చించనున్నారు.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఆందోళనపడిపోయింది. దీనిలో భాగంగా బస్సులు నడపాలా..? వద్దా అనే సందిగ్దంలో ఉంది. ఇప్పటి రెండు నెలల నుంచి సామాన్యుల నుంచి వ్యాపారస్తుల వరకూ లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వాలి అనే అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా చర్చించనున్నారు. సాగునీటి అంశాలపై, రైతులు ఏ పంటలు పండించాలి, అందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి.. అనే దానిపై భేటీలో చర్చించనున్నారు. ఇందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story