ఎంఐఎం ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దు
By అంజి
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, అతని బృందం కలిసింది. బీజేపీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి హాజరైన కనీసం గౌరవం ఇవ్వడం లేదని కమిషనర్‌కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. భైంసాకు బీజేపీ నేతలు వెళ్తానంటే అనుమతించని పోలీసులు.. ఎంఐఎం పార్టీ చేసే కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగా అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే మాటాలు మాట్లాడుతున్నా.. పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం బాగోలేదని సీపీ అంజనీకుమార్‌కు రాష్ట్రీ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు.
ఎల్లుండి చార్మినార్ వద్ద సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం భారీ ర్యాలీ చేపట్టనుంది. ఈ నెల 25వ తేదీన చార్మినార్ వద్ద ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దని కమిషనర్‌ను లక్ష్మణ్, రామచంద్రారావు కోరారు. మజ్లిస్ ర్యాలీకి అనుమతిస్తే వేరే చోట బీజేపీ వాళ్లు ఆందోళన చేసే అవకాశముందని లక్ష్మణ్ తెలిపారు. చార్మినార్ చాలా సున్నితమైన ప్రాంతమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మజ్లిస్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణను అతలాకుతలం చేసే విధంగా ఏ అవకాశం వచ్చినా, మత విద్వేషాలు సృష్టించి ఇవాళ టీఆర్‌ఎస్ ముసుగులో ఎంఐఎం రాజకీయాలు చేస్తోందని లక్ష్మణ్ విమర్శలు చేశారు.
ఓవైసీ బ్రదర్స్ తెలంగాణలో మతవిద్వేవాలు రెచ్చగోడుతున్నారని లక్ష్మణ్ అన్నారు. భైంసా ఘటన తెలంగాణ ప్రభుత్వానికి ఓ మచ్చ అని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పోలీసులు ప్రచారానికి అనుమతించలేదన్నారు. సీఏఏపై ప్రజల్లో గొడవలు సృష్టిస్తున్నారని, ఎంఐఎం పన్నాగంలో ఇతర పార్టీలు పావుగా మారాయన్నారు. అసదుద్దీన్‌కు ఎనలేని దేశభక్తి కలుగుతోందన్నారు. మోదీ, అమిత్‌షాల చలువతో జెండాకు వందనం చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ హల్వా ప్రకటనను అడ్డుం పెట్టుకొని హౌలా మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనుమతివ్వడం సరికాదని లక్ష్మణ్ వ్యాఖ్యనించారు.