సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
By రాణి Published on 16 March 2020 11:08 AM GMTసీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఏఏ పై ఎంఐఎం, బీజేపీ ల అభిప్రాయాలను తీసుకున్న కేసీఆర్..సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని సోమవారం జరిగిన సమావేశంలో ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం..దానిపై ఆమోదముద్ర వేశారు. అంతకుముందే ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు తీర్మానంపై తమ అభిప్రాయాల్ని తెలిపారు.
Also Read : కరోనాను “షూట్” చేస్తున్న సినీ పరిశ్రమ
తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతుండగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..సీఏఏ ను ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో కారణాలను తెలిపారు. ఈ బిల్లు పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఢిల్లీలో కూడా దీనిపై పెద్ద ఎత్తున అల్లర్లు జరుగగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. సరిగ్గా ట్రంప్ మనదేశంలో పర్యటిస్తున్న సమయంలోనే దేశరాజధానిలో ఈ తరహా అల్లర్లు చెలరేగడం బాధాకరమన్నారు.
Also Read : ప్రాణాలమీదికి తెచ్చిన సైకోతో వివాహేతర సంబంధం..
పార్లమెంట్ లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు సీఏఏ బిల్లును వ్యతిరేకించారని, ఇప్పటికే ఏడు రాష్ర్టాలు దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయని తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏపై ఆందోళన పరిస్థితి నెలకొన్న తరుణంలో మన అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం కేసీఆర్. ''ఇప్పటి వరకూ నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు. ఇంకా మా నాన్నది తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తేవాలి ? నా పరిస్థితే ఇలా ఉంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి ? మనదేశంలో ఉండే కోట్లాది మంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు ? ఎక్కడైనా ఓట్లతోనే అధికారంలోకి రావాల్సి ఉంటుంది..ఓటు హక్కు ఉన్నవారందరికీ ఓటర్ ఐడీ కూడా ఉంటుంది. సీఏఏను మేధావులు, కవులు, నిపుణులు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు కూడా వ్యతిరేకిస్తున్నారు'' అని కేసీఆర్ తెలిపారు. ఎవరైనా సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహి, పాకిస్థాన్ ఏజెంట్ అంటూ కేంద్రం నిందలేస్తోందని కేసీఆర్ విమర్శించారు.