త్వరలోనే తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీ ఖరారు
By సుభాష్
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఇక భారత్‌లో కూడా కరోనా కేసులు నమోదవుతుండటంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అంతే కాదు పదో తరగతి విద్యార్థుల పరీక్షలు సైతం వాయిదా వేస్తూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. కరోనా దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. తాజాగా తెలంగాణ పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 23 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన టెన్త్ పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
అయితే మార్చి 31 నుంచి 7వ తేదీ వరకకు పరీక్షల నిర్వహించాలని ముందుగా భావించినా..ఇంతలోనే 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో లాక్‌డౌన్ ప్రభావం విద్యార్థుల పరీక్షలపై పడింది. దీంతో తెలంగాణలో పరీక్షలు వాయిదా పడ్డట్లయింది.
ఇక ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని పరీక్షల డైరెక్టర్ సత్యనారాణరెడ్డి సోమవారం తెలిపారు. వాయిదా పడిన పరీక్షలతో పాటు ఇతర పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కాగా, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 70కి చేరగా, ఒక కరోనా మరణం సంభవించింది. ఇక దేశ వ్యాప్తంగా 1100 వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అయ్యాయి.