మొదటిసారి మాస్క్ పెట్టుకుని కనిపించిన ట్రంప్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2020 5:59 AM GMT
మొదటిసారి మాస్క్ పెట్టుకుని కనిపించిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ఢ్ ట్రంప్ మొదటి సారి పబ్లిక్ లో మాస్క్ పెట్టుకుని కనిపించారు. అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోందన్నదానికి ట్రంప్ మాస్క్ పెట్టుకుని కనిపించడమే ఒక ఉదాహరణ అని పలువురు చెబుతూ ఉన్నారు.

ట్రంప్ నలుపు రంగు మాస్కు వేసుకుని శనివారం నాడు కనిపించాడు. అందులో ప్రెసిడెన్షియల్ సీల్ కూడా ఉంది. యుద్ధఖైదీలను పరామర్శించడానికి వాషింగ్టన్ లోని వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రికి ట్రంప్ చేరుకున్నారు. అలా మొదటిసారి ట్రంప్ మాస్క్ తో పబ్లిక్ లో కనపడ్డారు. హాస్పిటల్ లో మాస్క్ ధరించడం ఎంతో మంచిదని, సైనికులను పరామర్శిస్తున్న వేళ, తనకు సౌకర్యంగా అనిపించిందని అన్నారు. మాస్క్ లను ధరించడాన్ని తానేమీ వ్యతిరేకించలేదని, అయితే, అందుకు సమయం, సందర్భం ఉండాలని చెప్పుకొచ్చారు.

అమెరికాకు చెందిన యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు మాట్లాడుతూ సామాజిక దూరం పాటించడం వీలు పడని సమయంలో పబ్లిక్ లో మాస్కులు ధరించాలని కోరింది. కానీ ట్రంప్ మాత్రం మొదట వాటిని పట్టించుకోలేదు. చాలా సందర్భాల్లో ట్రంప్ మాస్క్ లను ధరించడాన్ని పక్కన పెట్టేశారు. వైట్ హౌస్ సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని తెలిసినా కూడా ట్రంప్ మాస్క్ లను ధరించలేదు. పొలిటికల్ ర్యాలీల లోనూ, మీడియా సంస్థలతో మాట్లాడే సమయాల్లోనూ ట్రంప్ మాస్క్ ను ధరించలేదు. వైస్ ప్రెసిడెంట్ బిడెన్ మాస్క్ వేసుకుంటే ఎగతాళి చేశారు కూడానూ..! మాస్క్ వేసుకుంటే తనను బలహీనుడిగా భావిస్తారని.. అందుకే తాను మాస్క్ లను వేసుకోవడం లేదని గతంలో తన అనుచరులతో చెప్పిన ట్రంప్ తాజాగా మాస్క్ ధరించాల్సి వచ్చింది.

Next Story