నేపాల్‌లో భారీ వర్షాలు.. 44 మంది గల్లంతు..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2020 2:11 PM GMT
నేపాల్‌లో భారీ వర్షాలు.. 44 మంది గల్లంతు..!

నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి చాలా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 19 మంది వాటిలో చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో వాటి కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్ప‌టివ‌రకు 44మంది గ‌ల్లంతైన‌ట్లు గుర్తించామ‌ని, ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. శిథిలాల చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మ‌రం చేశామని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా పొఖారా ప‌ట్ట‌ణానికి స‌మీపంలోని సారంగ్‌కోట్‌, హేమ్‌జాన్ ప్రాంతాల్లో ఎక్కువ‌గా కొండ‌చరియ‌లు విరిగి ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండ‌చరియ‌లు విరిగిప‌డిన‌ ఘ‌ట‌న‌ల్లో మ‌రో 12మంది ప్రాణాలు కోల్పోయార‌ు. ప్ర‌స్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక బృందాలతో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌ట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. కొండ ప్రాంతాల్లో ఉన్న మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story