పర్యాటకులపై నిషేధం విధించిన ట్రంప్‌

By సుభాష్  Published on  13 March 2020 12:51 PM IST
పర్యాటకులపై నిషేధం విధించిన ట్రంప్‌

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభంజనాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఐరోపా దేశాల నుండి వచ్చే పర్యాటకులపై నెలరోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇప్పటికే అమెరికాలో 1,300 కరోనా కేసులు నమోదు కాగా, 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా వైరస్‌ విస్తృతిని అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఐరోపా నుండి తమ దేశానికి వచ్చే అన్ని రకాల పర్యాటకులపై నెలరోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు దేశ ప్రజలనుద్దేశించిన వైట్‌హౌస్‌ నుండి టెలివిజన్‌లో చేసిన ప్రసంగంలో ట్రంప్‌ ప్రకటించారు. ఈ ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయన్నారు. అయితే ఇతర దేశాల నుండి స్వదేశానికి వచ్చే అమెరికన్లకు దీని నుండి మినహాయింపు వుంటుందని, కానీ వారు కరోనా వైరస్‌కు సంబంధించిన స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని ఆయన వివరించారు.

అలాగే ఇది కరోనా వ్యక్తులకు సోకకుండా చూడటానికి తీసుకొనే చర్య కాబట్టీ యూరోపియన్ కంట్రీస్ తో బిజినెస్ వ్యవహారాల్లో మార్పు ఉండదు అన్నారు. ఐరోపా దేశాలు ఈ వైరస్‌ విస్తృతిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో విఫలమైనందు వల్లే తమ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు.

ఇప్పటికే ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా వున్న చైనా, ద.కొరియా తదితర దేశాల్లో పరిస్థితిని తాను నిశితంగా గమనిస్తున్నానని, వైరస్‌ ప్రభావిత దేశాలకు అత్యవసర పర్యటనలను కూడా నిలిపివేసుకోవాలని తాను ప్రజలను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. అత్యంత పరిశుభ్రతా విధానాలను అలవర్చుకోవాలని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, జనం భారీయెత్తున గుమిగూడే ప్రదేశాలకు దూరంగా వుండాలని ఆయన సూచించారు. ఇది ఆర్థిక సంక్షోభం కాదని, ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమేనన్న ట్రంప్‌, తాము ఈ సమస్యను అధిగమించ గలమని ధీమా వ్యక్తం చేశారు. అమెరికన్‌ ప్రజలను కాపాడేందుకు తాము ఫెడరల్‌ ప్రభుత్వానికి, ప్రైవేటు రంగానికి పూర్తి అధికారాలను కట్టబెడుతున్నామన్నారు. అయితే ట్రంప్ విధానాలపై బిడెన్ మండిపడుతున్నారు.

వ్యాధి తీవ్రంగా ఉన్నాదని తెలిసిన తరువాత కూడా ట్రంప్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం అతని నిర్లక్ష్య ధోరణికి అద్దం చెబుతున్నారు. మరోవైపు ఐరోపా దేశాల నుండి అమెరికాకు వచ్చే పర్యాటకులపై నెలరోజుల పాటు నిషేధం విధించాలన్న ట్రంప్‌ ప్రకటనను ఐరోపా దేశాల కూటమి తీవ్రంగా ఖండించింది. కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోందని, ఇది ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదని ఇయు ఒక ప్రకటనలో ట్రంప్‌కు గుర్తుచేసింది. దీనిని ఎదుర్కొనేందుకు ఏకపక్ష చర్యలు కాక పరస్పర సహకారం అవసరమని స్పష్టం చేసింది. తమతో ఎటువంటి సంప్ర దింపులు జరపకుండా అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఇయు తన ప్రకటనలో పేర్కొంది.

Next Story