హెచ్‌ఐవీని జయించిన రెండో వ్యక్తి

By సుభాష్  Published on  12 March 2020 8:57 AM GMT
హెచ్‌ఐవీని జయించిన రెండో వ్యక్తి

ఓ వ్యక్తిని హెచ్‌ఐవీని జయించాడు. ఎయిడ్స్‌ మహమ్మారితో యుద్దం చేసి గెలిచాడు. హెచ్‌ఐవీని జయించిన రెండో వ్యక్తిగా రికార్డుకెక్కాడు. లడన్‌కు చెందిన ఆడమ్‌ క్యాస్టిల్లెజోకు హెచ్‌ఐవీ సోకగా, 30 నెలల తర్వాత ఆయన బయటపడ్డాడు. యాంటీ-రిట్రోవైరల్‌థెరపీ చేయించుకోవడాన్ని ఆపేశాడు. ఎయిడ్స్‌ కు మందులేదు. మరెలా సాధ్యమైందనే అనుమానం అందరిలో కలిగింది. కణజాల చికిత్స ద్వారా ఎయిడ్స్‌ నయమైందని వైద్యులు స్పష్టం చేశారు. ఇది వరకు టిమోతీ బ్రౌన్‌ అనే వ్యక్తి కూడా ఎయిడ్స్‌ నుంచి బయటపడ్డాడు. ఇతను బెర్లిన్‌ పేషంట్‌గా ప్రాచుర్యం పొందాడు. ఆయన కూడా ఇలాంటి చికిత్సే తీసుకున్నారు.

ఈ విషయంపై లాన్సెట్‌ హెచ్‌ఐవీ జర్నల్‌ డాక్టర్‌ మాట్లాడుతూ.. అతనికి క్యాన్సర్‌ ఉండటంతో చికిత్స చేశామని, దీంతో హెచ్‌ఐవీ కూడా నయమైందని తెలిపారు. ఆ యువకుడికి ఎవరో దాత కణజాలాన్ని ఇచ్చారని, ఆ దాతకు ప్రత్యేక జన్యువులు ఉండటంతో హెచ్‌ఐవీ నుంచి కాపాడే లక్షణాలున్నాయన్నారు. అవి ఆ వ్యక్తి శరీరంలో చేరి అతనికి ఉన్న హెచ్‌ఐవీ తరిమికొట్టాయన్నారు. 40 ఏళ్ల ఆడమ్‌ కాస్టిల్లెజో ఇప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి తనకు ఎయిడ్స్‌ ఎలా నయమైందో చెప్పాలనుకుంటున్నాడు. ఈ విధంగా చేయడంతో ఎయిడ్స్‌ వ్యాధిని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉందనే ధైర్యాన్ని హెచ్‌ఐవీ రోగుల్లో నింపాలనుకుంటున్నాడు. నిజానికి ఏడాది కిందటనే అతని శరీరం నుంచి హెచ్‌ఐవీ వైరస్‌ తొలగిపోయింది. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని వైద్యులు ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టారు.

తిరిగి వైరస్‌ లక్షణాలు కనిపిస్తాయోమోనని ఏడాది పాటుగా ఎదురు చూశారు. అలాంటిదేమి లేకపోవడంతో ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇక సదరు వ్యక్తికి హెచ్‌ఐవీ పూర్తిగా నయమైనట్లేనని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ లీడ్‌ రీసెర్చర్‌ ప్రొఫెసర్‌ రవీంద్రకుమార్‌ గుప్తా కూడా స్పష్టం చేశారు.

చికిత్స ఏమిటీ..?

మూల కణ మార్పిడి చికిత్స ద్వారా హెచ్‌ఐవీ పేషెంట్‌లోని వ్యాధి నిరోధక కణాలను దాత కణాలతో భర్తీ చేయవచ్చు. ఈ కణాలు వైరస్‌ శరీరంలో అభివృద్ధి కాకుండా అడ్డుకుంటాయి. ప్రస్తుతం ఆడమ్‌ రక్తంలో, వీర్యంలో, శరీర కణజాలంలో హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ క్రియాశీలంగా లేదని వైద్యులు చెప్పారు.

ఇది హెచ్‌ఐవీ ఉన్నవాళ్లందరికీ చేసే చికిత్స కాదు..

ఇది హెచ్‌ఐవీ ఉన్నవాళ్లందరికీ చేసే చికిత్స కాదని చెబుతున్నారు వైద్యులు. క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఈ చికిత్సను చేస్తారు. ఇది చాలా రిస్క్‌ తో కూడుకున్న చికిత్స. ప్రస్తుతం ఎయిడ్స్‌ ఉన్నా, ఆరోగ్యంగా చాలా కాలం బతికేందుకు ఉపయోగపడే మెడిసిన్‌ అందుబాటులోకి వచ్చాయి. మూల కణ మార్పిడి చికిత్స చాలా కష్టతరమైనదని వైద్యులు వివరిస్తున్నారు.

హెచ్‌ఐవీ ఉండి, కొన్ని ప్రాణాంతక క్యాన్సర్లతో బాధపడుతున్నవారికి చివరి సారిగా ఈ చికిత్సను నిర్వహిస్తారు. హెచ్‌ఐవీ ఉన్నా, యాంటీ రెట్రోవైరల్‌ ఔషధాలతో ఆరోగ్యంగా ఉండవచ్చు. వాళ్లకు ఈ చికిత్స చేయరని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ లీడ్‌ రీసెర్చర్‌ ప్రొఫెసర్‌ రవీంద్రకుమార్‌ గుప్తా తెలిపారు. రాబోయే రోజుల్లో జన్యు చికిత్సల ద్వారా హెచ్‌ఐవీకి పరిష్కారం కనిపెట్టేందుకు దీని ద్వారా అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Next Story