హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు నా వ‌ల్లే చెడ్డ పేరు : ట‌్రంప్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2020 9:58 AM GMT
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు నా వ‌ల్లే చెడ్డ పేరు : ట‌్రంప్‌

మ‌లేరియాకు వాడే మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ). ఈ ఔష‌దానికి త‌న వ‌ల్లే చెడ్డ పేరు వ‌చ్చింద‌ని అంటున్నారు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌. ఇంకెవ‌రైనా ఈ మందు గురించి చెప్పి ఉంటే.. ఇంత‌కంటే అద్భుత‌మైన ఔష‌దం మ‌రొక‌టి లేద‌ని అనే వారని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా అధ్య‌క్షుడు పుణ్య‌మా అని ఈ మందు చాలా ఫేమ‌స్ అయ్యింది. క‌రోనా చికిత్స‌కు ఈ ఔష‌దం అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని మొన్నామ‌ధ్య ట్రంప్ చెప్పినప్ప‌టి నుంచి ఈ మందుకు తెగ గిరాకీ పెరింగింది. క‌రోనా వైర‌స్ సోక‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా తాను రోజు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్ర‌ల‌ను వేసుకుంటున్న‌ట్లు ట్రంప్ నిన్న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రోసారి హైడ్రాక్సీ క్లోరోక్విన్ గొప్ప త‌నాన్ని ట్రంప్ మ‌రోసారి గ‌ట్టిగా స‌మ‌ర్థించారు. కరోనా వైరస్ విషయంలో ఈ మందు ఒక 'రక్షణ రేఖ' (లైన్ ఆఫ్ డిఫెన్స్) అంటూ వ్యాఖ్యానించాడు. ఈ మాట‌లు తాను చెబుతున్న‌వి కాద‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైద్యులు హెచ్‌సీక్యూ వాడ‌కంపై సానుకూల‌త వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. వైట్‌హౌజ్‌లో నా వ్య‌క్తిగ‌త డాక్ట‌ర్‌ను ఈ మందు పై మీ అభిప్రాయం ఏమిట‌ని అడిగాను. ఆయ‌న ఒక్క ముక్క‌లో 'లైన్ ఆఫ్ డిఫెన్స్' అంటూ చెప్పుకొచ్చార‌ని తెలిపారు. దీని వ‌ల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేవ‌ని, మ‌రికొంత కాలం పాటు తాను ఈ ఔష‌దాన్ని తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇక తాను ప్ర‌చారం క‌ల్పించ‌డం వ‌ల్లే ఈ ఔష‌దానికి చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని, ఇంకెవ‌రైనా దీని గురించి చెప్పి ఉంటే ఇంత అద్భుత‌మైన మందు మ‌రోక‌టి లేద‌ని అనే వారు అని ట్రంప్ అభిప్రాయ‌ప‌డ్డారు. అందుక‌నే క‌రోనా పై పోరులో ముందు వ‌రుస‌లో ఉన్న సిబ్బందికి తాను దీన్ని ప్ర‌తిపాదించాన‌ని గుర్తు చేశారు. ఇట‌లీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో ఈ ఔష‌దం మెరుగైన ఫ‌లితాలు చూపిన‌ట్లు ప‌లు అధ్య‌య‌నాలు చెప్పిన‌ట్లు గుర్తు చేశారు. అయితే.. ఈ మందు ప‌నిచేయ‌డం లేదంటూ ఇటీవ‌ల ఓ నివేదిక వ‌చ్చింది కదా..? అడ‌గ‌గా.. కావాల‌నే చ‌నిపోయే స్థితిలో ఉన్న‌వారికి ఈ ఔష‌దాన్ని ఇచ్చి.. ఈ మందు ప‌నిచేయ‌డం లేదంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని ట్రంప్ ఆరోపించారు.

Next Story